Rekha jhunjhunwala: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్‌తో కూడుకున్న విషయం తెలిసిందే. అయితే ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝన్ వాలా గురించి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి బాగా తెలిసే ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య రేఖ కంపెనీ పగ్గాలు చేపట్టారు. ఆమె కూడా స్టాక్‌లో మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి బాగానే అనుభవం సంపాదించారు.
షేర్ల విలువ క్షీణించడంతో..(Rekha jhunjhunwala)
అయితే మంగళవారం నాడు ఆమె ఇన్వెస్ట్ చేసిన షేర్ల విలువ భారీగా క్షీణించడంతో ఆమె ఒక్క రోజే సుమారు రూ.800 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. కాగా రాకేశ్ బతికున్న రోజుల్లోనే ఆయన టాటాగ్రూపునకు చెందిన టైటాన్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. మార్చి 31, 2024 నాటికి కంపెనీలో వారి వాటా 5.35 శాతంగా తేలింది. శుక్రవారం నాడు మార్కెట్ ముగిసే నాటికి వాటి విలువ రూ.16,792 కోట్లుగా తేలింది. అయితే టైటాన్ ఫలితాలు నిరుత్సాహానికి గురి చేయడంతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు లక్షల కోట్ల నుంచి కిందికి దిగివచ్చింది. శుక్రవారం నాడు దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,13,868 కోట్లు … మంగళవారానికి అది కాస్తా రూ.2,98,815 కోట్లకు దిగివచ్చింది. ఇక రేఖ ఝన్‌ఝన్ వాలా పెట్టుబడుల విషయానికి వస్తే రూ.16,792 కోట్ల నుంచి రూ.15,986 కోట్లకు పడిపోయింది. అంటే నికరంగా రూ.805 కోట్లు నష్టపోయినట్లు లెక్క. బీఎస్‌ఈలో దీని షేరు రూ.3,352.25కు దిగివచ్చింది. క్యూ4 ఫలితాల విషయానికి వస్తే కంపెనీ స్టాండ్ ఎలోన్ నికర లాభం 7 శాతం పెరిగి రూ.786 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.734 కోట్లు నమోదైంది. ఇక కంపెనీ రెవెన్యూ విషయానికి వస్తే 17 శాతం పెరిగి రూ.10,047 కోట్లకు ఎగబాకింది.
బ్రోకింగ్ హౌస్‌లు మాత్రం బంగారం ధరలు ఒడిదుడుకులకు లోను కావడంతో సమీప భవిష్యత్తులో లాభాల మార్జిన్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఈపీఎస్ 8 శాతం, వచ్చే ఏడాది ఈపీఎస్ రెండు శాతం కోత విధించాయి బ్రోకింగ్ హౌస్‌లు, అయితే దీర్ఘకాలంలో నగల వ్యాపారం పుంజుకొనే అవకాశం ఉంటుంది.. అదే సమయంలో బలమైన బ్రాండ్ పేరుఉన్న క్రమంలో కంపెనీకి చెందిన ఇతర బ్రాండ్‌ల ద్వారా మంచి లాభాలు పొందవచ్చునని అంచనా వేస్తున్నాయి బ్రోకింగ్ హౌస్‌లు.