Tamil Nadu: భారత వాతావరణ శాఖ ( ఐఎండి) తమిళనాడులోని 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం తరువాత పశ్చిమ-వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉంది మరియు మరింత తీవ్రం కావచ్చు. ఈ సమయంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది.
తమిళనాడులోని విల్లుపురం, చెంగల్‌పట్టు, కడలూరు, కాంచీపురం, తిరువళ్లూరు, అరియలూరు, పెరంబలూరు, చెన్నై, కళ్లకురిచ్చి, మైలాడుతురై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.రెడ్ అలర్ట్ నేపథ్యంలో ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ఈ బృందాలను నాగపట్నం, తిరువారూర్, కడలూరు, మైలాడుతురై, తంజావూరు, చెన్నైలలో సన్నద్దంగా ఉన్నాయి.పుదుచ్చేరిలో డిసెంబర్ 6న తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని,డిసెంబర్ 7-9 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం డైరెక్టర్ పి.సెంతమరై కణ్ణన్ తెలిపారు. ఇది డిసెంబర్ 7 నాటికి అల్పపీడనంగా మారవచ్చు మరియు పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లి ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం దక్షిణ ఆంధ్ర ప్రదేశ్‌పై కూడా ఇది ప్రభావం చూపుతుంది. డిసెంబర్ 7 అర్ధరాత్రి నుండి ఆంధ్రాలో వర్షాలు కురుస్తాయని, ఇది డిసెంబర్ 8 మరియు 9 తేదీలలో పెరిగే అవకాశం ఉందని అంచనా.