Prime9

Ram Mohan Naidu on Plane Crash: హైలెవల్ కమిటీ ప్రమాదంపై దర్యాప్తు చేస్తుంది: రామ్మోహన్‌ నాయుడు

Ram mohan Naidu review on Plane Crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ఘటనను పౌర విమానయాన శాఖ తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. విమాన ప్రమాదంపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలిలో సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గుజరాత్‌ సర్కారు, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

 

ఘటన జరిగిన వెంటనే మంటలు ఆర్పి మృతదేహాలను తరలించామన్నారు. ఘటనపై విచారణకు వెంటనే ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరం అయితే మరికొంత మంది సభ్యులను బృందంలో చేరుస్తామని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఘటనా స్థలిలో బ్లాక్స్‌బాక్స్‌ దొరికిందని తెలిపారు. బాక్స్‌ను విశ్లేషించిన తర్వాత ఏం జరిగిందనేది పూర్తిగా తెలుస్తుందని వివరించారు. బాక్స్‌లో ఏముందు తెలుసుకునేందుకు తాము ఎదురుచూస్తున్నామని తెలిపారు.

 

ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాల బాధను అర్థం చేసుకోగలని చెప్పారు. తన తండ్రి కూడా ప్రమాదంలోనే మృతిచెందారని గుర్తుచేశారు. ఆ బాధ తనకు కూడా తెలుసు అన్నారు. హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రత్యేకాధికారులతో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. సంపూర్ణ దర్యాప్తు జరిపేందుకు కమిటీ సభ్యులు దోహదపడతారని తెలిపారు. నిపుణుల విచారణ పూర్తయ్యాక తగిన సమయంలో మీడియాకు సమాచారమిస్తామన్నారు. రెండు నెలల్లో విచారణ పూర్తవుతుందని భావిస్తున్నామని తెలిపారు. బోయింగ్‌ 787 సిరీస్‌ను తరచూ తనిఖీలు చేయాలని ఆదేశించామని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

 

Exit mobile version
Skip to toolbar