Rahul Gandhi Sensational Comments about BC Reservation Bill: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఏఐసీసీ సమావేశంలో దేశంలో నెలకొన్న సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమస్యలు తీర్చాలంటే దేశాన్ని ఎక్స్‌రే తీయాలని అన్నారు.
బీసీల రిజర్వేషన్ల పెంచేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందన్నవారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లను పెంచుతూ చేసిన బిల్లును కేంద్రానికి పంపించారన్నారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పంపిన రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అంతేకాకుండా,తెలంగాణలో కులగణన సర్వేను ఆ రాష్ట్ర సర్కార్ విజయవంతంగా చేపట్టిందన్నారు. ఈ కులగణన సర్వే ఆధారంగానే రిజర్వేషన్లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాహుల్ గాంధీ అన్నారు.
తెలంగాణలో 90 శాతం జనాభాలో ఓబీసీలు, దళితులు, మైనార్టీలు ఉన్నారన్నారు. అయితే రాష్ట్ర సంపద మాత్రం కొన్ని కార్పొరేట్ వర్గాల దగ్గరే ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ.. ఎప్పుడూ ఓబీసీలు, ఆదివాసీల గురించి మాట్లాడుతారని, కానీ ఆ వర్గాలకు మేలు చేరిగే విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రద్దు విషయంపై బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కులగణన సర్వే చేపట్టిందని, దేశంలో కూడా ఈ కులగణన సర్వే చేపట్టాలని రాహుల్ గాంధీ అన్నారు. ఈ కులగణనతోనే ఓబీసీలు, దళితులు, మైనార్టీల జనాభా తెలిసే అవకాశం ఉందన్నారు. అయితే ఈ కులగణన సర్వేకు బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ తీవ్ర వ్యతిరేకమని విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా జనగణనలో కులగణన చేసేంత వరకు పోరాటం చేస్తామన్నారు. రిజర్వేషన్ల విషయంలో 50 శాతం వరకు ఉన్న పరిమితిని తొలగిస్తామని వెల్లడించారు.