Prime9

Pakistan : పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం.. మరో యూట్యూబర్‌ అరెస్టు

Pakistan Spying : పహల్గాంలో ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్‌‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఆరోపణలతో మరో యూట్యూబర్‌ను పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

 

రూపనగర్‌ జిల్లాలోని మహలాన్‌ గ్రామానికి చెందిన జస్బీర్‌ సింగ్‌ జాన్ మహల్‌ అనే పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నాడు. ఛానెల్‌కు 1.1 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. నిందితుడికి పాక్ ఇంటెలిజెన్స్ అధికారి, ఐఎస్ఐకు పనిచేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న షకీర్‌ అలియాస్ జుట్‌ రాంధావాతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. పాకిస్థాన్ రాయబార కార్యాలయ అధికారి ఎహసాన్‌ ఉర్‌ రహీం అలియాస్‌ డానిష్‌తో కూడా టచ్‌లో ఉన్నాడు. ఇటీవల గూఢచర్యం కేసులో అరెస్టయిన హర్యానా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాతో ఇతడికి దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తేలింది.

 

డానిష్‌ ఆహ్వానం మేరకు ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో జరిగిన జాతీయ దినోత్సవానికి సింగ్‌ హాజరైనట్లు గుర్తించాం. 2020, 2021, 2024 ఏడాదిల్లో పాక్‌లో ఇతడు పర్యటించాడు. నిందితుడికి సంబంధించిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. పాకిస్థాన్‌కు చెందిన అనేకమంది నంబర్లు బయటపడ్డాయి. జ్యోతి అరెస్టు నేపథ్యంలో వాటిని తొలగించేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకొని పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నాం. కాగా, పాకిస్థాన్‌కు గూఢచర్యం కేసులో పంజాబ్‌లో ఇప్పటివరకు 7 మంది అరెస్టు అయ్యారు.

 

పాకిస్థాన్ నిఘా సంస్థలకు భారత్‌‌కు చెందిన సున్నితమైన సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా ఇటీవల అరెస్టు అయిన విషయం తెలిసిందే. 2023లో పాకిస్థాన్‌కు వెళ్లిన సమయంలో ఆమెకు డానిష్‌తో పరిచయమైంది. అనంతరం ఆమె ఆ దేశ గూఢచర్య సంస్థ ప్రతినిధులతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో జ్యోతికి ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు, ఉగ్ర కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. ఆమె పూర్తి స్పృహతోనే పాక్ ఇంటెలిజెన్స్‌ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందన్నారు.

Exit mobile version
Skip to toolbar