Golden Temple Blast: పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వరుస పేలుళ్లలతో ఆ ప్రాంతమంతా తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. కాగా తాజాగా గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటన అక్కడి స్థానికి ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది. లంగర్ హాల్ ఎదురుగా ఉన్న శ్రీగురు రామ్ దాస్ జీ సరాయ్ వద్ద బుధవారం అర్థరాత్రి ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
ఐదు రోజుల్లో మూడోసారి(Golden Temple Blast)
గోల్డెన్ టెంపుల్ సమీపంలో గత ఐదురోజుల్లో మూడు సార్లు పేలుళ్లు జరిగాయి. దానితో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజాగా జరిగిన పేలుడు ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అక్కడి అధికారులు తెలిపారు. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత 1గంట సమయంలో ఈ పేలుడు చోటు చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. హుటాహుటిన పేలుడు ఘటన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ పేలుడుకు ఖచ్చితమైన కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు.
గోల్డెన్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే రెండు సార్లు పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. గత శనివారం గోల్డెన్ టెంపుల్ పార్కింగ్ స్థలంలో నిర్మించిన రెస్టారెంట్ లో పేలుడు సంభవించగా.. రెస్టారెంట్లోని చిమ్నీ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఇక అదేవిధంగా సోమవారం హెరిటేజ్ పార్కింగ్ స్థలంలో పేలుడు సంభవించింది కానీ దాని వెనుక కారణాలు తెలియరాలేదు. అంతలోనే రెండు రోజుల గ్యాప్లో మరల ఇలా మరోసారి పేలుడు సంభవించడం అనేక అనుమానాలకు దోహదం చేస్తుంది.
మరి ఈ వరుస పేలుడు ఘటనలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.