Site icon Prime9

PM Modi: మారిషస్‌లో మోదీ పర్యటన.. పలు కీలక అంశాలపై ఒప్పందం!

Prime Minister Narendra Modi to Visit Mauritius: ప్రధాని నరేంద్ర మోదీ మిత్రదేశం మారిషస్‌కు బయలుదేరారు. ఈ మేరకు ఆ దేశంలో రెండు రోజులపాటు మోదీ పర్యటించనున్నారు. అలాగే మార్చి 12న జరగనున్న మారిషస్ 57వ జాతీయ దినోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులాం ఆహ్వానమేరకు ప్రధాని మోదీ మారిషస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులాంను కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈ రెండు రోజుల పర్యటన ఇరుదేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.

 

మారిషస్ దేశం.. హిందూ మహాసముద్రంలో మన దేశానికి కీలక భాగస్వామికి మాత్రమే కాదని, ఆఫ్రికా ఖండానికి కూడా ముఖద్వారమని మోదీ పేర్కొన్నారు. అలాగే మారిషస్‌తో చారిత్రకం, భౌగోళికం, సంస్కృతికంగా భారత్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని మోదీ గుర్తు చేశారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాల్లో సరికొత్త శకానికి నాంది పలుకుతుందని చెప్పారు. ఈ పర్యటలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశ ప్రతినిధులతో భేటీ కానున్నారు.

 

ప్రధానంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక, భద్రతా సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో పాటు సముద్ర భద్రత, ఆర్థిక నేరాల నియంత్రణ వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ పర్యటనపై ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులాం మాట్లాడారు. మోదీకి విశిష్ట ఆతిథ్యం ఇవ్వడం మారిషస్ దేశానికి ప్రత్యేకమైన గౌరవమన్నారు. మోదీ రెండు రోజుల పర్యటనలో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొంటాయని తెలిపారు.

 

Exit mobile version
Skip to toolbar