Prime Minister Modi to Visit the US, Meet President Donald Trump: భారత ప్రధాని నరేంద్ర మోదీ నాలుగురోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. నేటి నుంచి సాగనున్న ఈ పర్యటనలో భాగంగా తొలుత ఫ్రాన్స్, ఆ పై అమెరికా దేశాలలో ఆయన పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఉభయ దేశాల అధ్యక్షులతో భేటీ కానున్నారు. ట్రంప్ రెండవ సారి అధ్యక్షుడైన తర్వాత వలసల మీద ఫోకస్ చేయటంతో.. ప్రధాని మోదీ ఆయనను కలవనుండటంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.
ఏఐ సదస్సుకు హాజరు..
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని 12వ తేదీ వరకు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. ఈ క్రమంలో 10వ తేదీన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి పారిస్‌లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అనంతరం కెడారచీ ధర్మో న్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్‌ను పరిశీలిస్తారు. అనంతరం 12వ తేదీ సాయంత్రానికి మోదీ అమెరికాలోని వాషింగ్టన్ డీసీకి చేరుకుంటారు.
13న ట్రంప్‌తో భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవ సారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి మోదీ ఆయనతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, రక్షణ, ప్రాంతీయ భద్రత అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముందని విదేశాంగ వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ ప్రభుత్వం పలు దేశాలపై భారీగా టారిఫ్ లు విధిస్తుండటం, వలసదారులను వెనక్కి పంపటంతో మోదీ, ట్రంప్ సమావేశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మోదీ చివరిసారిగా 2024 సెప్టెంబర్లో అమెరికాలో పర్యటించి, క్వాడ్ దేశాల అధినేతల సదస్సులో పాల్గొన్నారు. ప్రధాని మోదీ తన అమెరికా పర్యటనలో ఎలాన్ మస్క్ సహా ప్రముఖ వ్యాపారవేత్తలతో మోదీ సమావేశం కానున్నారు.
ఇక.. మున్ముందుకే..
కాగా, మోదీ అమెరికా పర్యటనతో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలియజేశారు. ట్రంప్ ప్రభుత్వం కొలువుదీరిన మూడు వారాల్లోపే తమ దేశంలో పర్యటించాలంటూ మోదీకి ఆహ్వానం అందిందని, ఇండియాతో భాగస్వామ్యానికి అమెరికా ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదొక ప్రతీక అని విక్రమ్ మిస్త్రీ వివరించారు.ఇంధన భద్రత, కృత్రిమ మేధ(ఐఎ) వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకొనేలా నిర్ణయాలకు అవకాశముందని చెప్పారు. ఇక.. మోదీ గొప్ప నాయకుడు, మిత్రుడు అంటూనే అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎక్కువ పన్నులు విధిస్తోందంటూ గతంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇండియాను టారిఫ్ కింగ్ అభివర్ణించారు.