PM Modi: నేరగాళ్లకు చుక్కలే .. పాత చట్టాలకు చెక్.. కొత్తగా మూడు చట్టాలు

3 new criminal laws to ensure justice for women: భారత రాజ్యాంగం ఆశించిన మార్పును అమలు చేసేందుకు దేశంలో అమల్లోకి వచ్చిన సరికొత్త నేర నియంత్రణ చట్టాలు అద్భుతంగా ఉపయోగనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం చండీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్లలో దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలను జాగ్రత్తగా అధ్యయం చేసి వీటిని రూపొందించారన్నారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అమిత్‌షా, పంజాబ్‌ గవర్నర్, సీఎం, పలువురు అధికారులు పాల్గొన్నారు.

దుర్మార్గాలకు చెక్..
తాను ఎప్పుడు చండీగఢ్‌ వచ్చినా, సొంత కుటుంబ సభ్యుల వద్దకు వచ్చినట్లు అనిపిస్తుందని, ఈ నగరం శక్తిస్వరూపిణి చండీ అమ్మవారి పేరుతో ఏర్పడిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఎలాగైతే అమ్మవారు దుష్టులను శిక్షించి, మంచివారిని కాపాడుతుందో అలాగే కొత్తగా వచ్చిన చట్టాలు సత్యం, న్యాయాన్ని నిలబెడతాయని పేర్కొన్నారు. భారత న్యాయసంహిత చట్టాల అమలుతో రాజ్యాంగ నిర్మాతల కల ఫలించిందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ చట్టాలు ఎలా అమలు చేస్తారనేది లైవ్‌ డెమో చూశానని, . ప్రజలు కూడా వీటిని చూడాలని కోరుతున్నాను.

నిపుణుల కష్టానికి ప్రతిరూపం
దేశంలోని సరికొత్తగా వచ్చిన న్యాయసంహిత చట్టాల రూపకల్పనలో ఎందరో నిపుణుల కష్టం దాగి ఉందని, వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని ప్రధాని ప్రకటించారు. ఈ చట్టాల రూపకల్పన సమయంలో హోమ్‌ మంత్రిత్వశాఖ 2020 జనవరిలో అభిప్రాయాలు కోరగా, న్యాయమూర్తులు, న్యాయవాదుల మొదలు న్యాయవిద్యాలయాలు, పౌర సంస్థలు, మేధావులు ముందుకొచ్చి, తమ అనుభవాలను, సలహాలను అందించి, భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా చట్టాల మీద మార్గదర్శనం చేశారని ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఆంగ్లేయుల వలస చట్టాలను ఇన్నేళ్లకు గానీ మనం మార్చుకోలేకపోయామన్న ప్రధాని, ఈ కొత్త చట్టాలతో నూతన మార్పులు రానున్నాయని, నేరగాళ్లు ఇక ఎంతమాత్రం తప్పించుకోలేరని అన్నారు.