Seema Haider : పబ్జీ గేమ్‌లో మొదలైన పరిచయంతో.. మన దేశ యువకుడిని ప్రేమించి పాకిస్థాన్ నుంచి వచ్చేసిన సీమా హైదర్ కేసు వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రేమ కోసం దేశ సరిహద్దులు దాటి భర్తను వదిలేసి.. నలుగురు పిల్లలతో కలిసి భారత్ వచ్చింది సదరు మహిళ. ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు సచిన్ మీనా అనే వ్యక్తితో పెళ్లి కూడా చేసుకుంది. గత కొన్నిరోజులుగా ఆమె తరచూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో కార్యక్రమంలో పాల్గొని మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో తన నివాసం వద్ద భర్తతో కలిసి జెండాను ఎగురవేసి.. హిందుస్థాన్ జిందాబాద్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఆమెతో పాటు తన భర్త సచిన్ మీనా, వారి తరఫున లాయర్ ఏపీ సింగ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీమా హైదర్ (Seema Haider) మాట్లాడుతూ.. తనకు వచ్చిన సినిమా అవకాశాన్ని వదిలేసినట్లు పేర్కొంది. జానీ ఫైర్‌ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న ‘కరాచీ టు నోయిడా’, ‘ఏ టైలర్ మర్డర్ స్టోరీ’ సినిమాల్లో సీమా హైదర్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. సినిమాను తిరస్కరించానని చెప్పిన సీమా.. అందులో ఏ చిత్రాన్ని తిరస్కరించారనేది మాత్రం అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అయితే సినిమా చేయవద్దని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో సినిమా చేయకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తన నలుగురు పిల్లలతో సహా భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టిన సీమా.. తాను పాక్ వెళ్లబోనని భారత్‌లోనే ఉంటానని తేల్చి చెప్పింది. దీనికి తోడు తనకు భారత పౌరసత్వం కల్పించాలని ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే సీమా హైదర్ పాకిస్థాన్ ఏజెంట్ అయి ఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతుంది.