Site icon Prime9

Niti Ayoga: నేతి బీరకాయలో నెయ్యిలా నీతి అయోగ: సీఎం కేసీఆర్

Niti Ayoga: కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించినట్టు చెప్పారు. తమ నిరసనను బహిరంగ లేఖ ద్వారా నేరుగా ప్రధానికి తెలియజేస్తున్నామని వెల్లడించారు.

నీతి ఆయోగ్‌ నిరర్థక సంస్థగా మారిందని కేసీఆర్ ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లానింగ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాను రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా నీతి ఆయోగ్‌ తీసుకొచ్చారన్నారు. నీతి ఆయోగ్‌ను టీమ్‌ ఇండియా అని పిలుస్తామని ప్రధాని చెప్తే.. సహకార సమాఖ్య విధానాన్ని పాటిస్తారని భావించామన్నారు. దేశానికి మంచి రోజులు వస్తాయని ఆశించామన్నారు. కానీ.. నేతి బీరకాయలో నెయ్యి చందంగా నీతి ఆయోగ్‌ పరిస్థితి తయారైందని విమర్శించారు.

దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయని కేసీఆర్ అన్నారు. 13 నెలల పాటు ఢిల్లీలో రైతులు ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ 8 ఏళ్ల పాలనలో ఏం చేశారని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో సాగు, తాగు నీటి సమస్య తీర్చలేదని మండిపడ్డారు. రూపాయి విలువ పాతాళ లోకానికి పడిపోయిందన్నారు. అంతర్జాతీయ విపణిలో మన పరువు పోతున్నా.. ఆలోచించడం లేదని విమర్శించారు. బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో సర్వనాశనమైందంటూ కేసీఆర్ విరుచుకుపడ్డారు.

రాష్ట్రాలకు రావాల్సిన 13 లక్షల కోట్ల నిధులను కేంద్రం ఎగ్గొట్టిందని కేసీఆర్ ఆరోపించారు. పన్నుల వసూలులో రాజ్యాంగంపరంగా కొన్ని పద్ధతులున్నాయన్న కేసీఆర్… రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని… టాక్సులకు సెస్సు పేరు పెట్టి వసూలు చేస్తున్నారని విమర్శించారు. సెస్సు పేరుతో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను ఎగ్గొడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రప్రభుత్వ విధానాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు.

Exit mobile version