Site icon Prime9

Indian Air Force: భారత వాయుసేన సిబ్బందికి కొత్త యూనిఫాం

IAF

IAF

Chandigarh: భారత వైమానిక దళ 90వ వార్షికోత్సవాలు శనివారం అట్టహాసంగా జరిగాయి. ఇందులో భాగంగా చండీగఢ్‎లో 80 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో విన్యాసాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా భారత వాయుసేన చీఫ్ వివేక్ రామ్ చౌదరి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలలో స్వల్పకాల ఉద్యోగ కోర్స్ ను అగ్నిపథ్ పేరుతో ఇటీవల తీసుకురాగా, ఇందులో మహిళలకూ అవకాశం లభించబోతోందని వివేక్ రామ్ చౌదరి తెలిపారు. వచ్చే ఏడాది అగ్నీవీర్ లుగా యువతులనూ తీసుకోనున్నట్టు ఐఏఎఫ్ చీఫ్ ప్రకటించారు.

ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకునే కొత్త యూనిఫాంను భారత వాయుసేన స్టాడింగ్ డ్రెస్ కమిటీ, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్తంగా రూపొందించాయి. ఈ సరికొత్త యూనిఫాంను భారత వాయుసేన సిబ్బందికి అందించనున్నారు. మైదానం, ఎడారి, పర్వత ప్రాంతాలు, అడవులు, ఇలా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలో నైనా ఈ యూనిఫాం ధరిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. కొత్త యూనిఫాం చాలా వరకు ఆర్మీ యూనిఫాంను పోలి ఉంటుంది. దీన్ని తేలికపాటి ఫ్యాబ్రిక్ తో రూపొందించారు. ఈ సరికొత్త యూనిఫాం కిట్ లో కంబాట్ టీషర్టు, ఫీల్డ్ స్కేల్ డిస్రప్టివ్ టోపీ, కంబాట్ బోనీ హ్యాట్, డిస్రప్టివ్ వెబ్ బెల్ట్, యాంక్లెట్ కంబాట్ షూ, మ్యాచింగ్ టర్బన్ పొందుపరిచారు.

అగ్నిపథ్ పథకం ద్వారా ఎయిర్ ఫోర్స్‎లోకి పోరాట యోధులను నియమించుకోవడాన్ని సవాలుగా తీసుకున్నామని వారు తెలిపారు. ఈ పథకాన్ని ఓ సవాలుగా పేర్కొంటూ, భారత్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇదొక చక్కని అవకాశమన్నారు. ఈ ఏడాది అగ్నీవీర్ లుగా 3వేల మందిని తీసుకుంటున్నామని, రానున్న సంవత్సరాల్లో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆయన చెప్పారు. ఐఏఎఫ్ అధికారుల కోసం వెపన్ సిస్టమ్ బ్రాంచ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. కొత్తగా నిర్వహణ బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం స్వాతంత్య్రం తర్వాత ఇదే మొదటిసారి అని అన్నారు. దీనివల్ల అన్ని రకాల ఆయుధ వ్యవస్థలను నిర్వహించడం తేలిక అవుతుందన్నారు. 17.5 నుంచి 21 ఏళ్ల వయసు వారు అగ్నీవీర్ ల కోసం పోటీపడొచ్చని తెలియజేశారు.

 

Exit mobile version