Site icon Prime9

Operation Brahma : మయాన్మార్‌కు భారత్ ఆపన్న హస్తం.. 50 టన్నుల సహాయక సామగ్రి అందజేత

Operation Brahma

Operation Brahma

Operation Brahma : భూకంపంతో మయాన్మార్‌ తీవ్రంగా నష్టపోయింది. దీంతో మయాన్మార్‌‌ను ఆదుకునేందుకు ఆపరేషన్‌ బ్రహ్మను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తాజా భారత్ మరో 50 టన్నుల సహాయక సామగ్రిని అందించింది. వివిధ రకాల సహాయక సామగ్రితో భారత్ నావికాదళానికి చెందిన సత్‌పుర, సావిత్రి నౌకలు యాంగూన్‌కు చేరుకున్నాయి. విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎంసీసీ విమానాలతోపాటు నేవీకి చెందిన 5 నౌకల ద్వారా ఇండియా ఆపరేషన్ బ్రహ్మ చేపడుతున్నట్లు యాంగూన్‌లోని భారత ఎంబసీ పేర్కొంది. భూకంపంతో ప్రభావితమైన యాంగూన్‌తో సహా నేపీదా, మాండలేకు సామగ్రిని చేరుస్తున్నట్లు తెలిపింది.

 

 

 

అనేక భవనాలు నేలమట్టం..
రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో మయాన్మార్‌తో‌పాటు పొరుగు దేశాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. మయాన్మార్‌లో ప్రకృతి విపత్తు బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య దాదాపు 2 వేలు దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ముమ్మర చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం గురించి తెలియగానే భారత్ స్పందించి, సహాయక సామగ్రి తోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది.

 

 

 

అత్యవసర వస్తువులు పంపిణీ..
ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా ఇప్పటి వరకు ఇండియా రెస్క్యూ బృందాలు, వైద్య బృందాలు, తాగునీరు, టెంట్లు, ఔషధాలు, ఇతర అత్యవసర వస్తువులను పలు విడతల్లో ఎయిర్‌ఫోర్స్, నేవీ ద్వారా పంపించింది. మార్చి 29వ తేదీన ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం 15 టన్నుల సహాయక సామగ్రిని యాంగూన్‌కు చేర్చింది. కోవిడ్ సమయంలో కూడా ఇండియా పలు దేశాల ఔషధ అసరాలు తీర్చేందుకు ముందుకొచ్చింది. వ్యాక్సిన్ మైత్రి పేరిట 90 దేశాలు ఔషధాలు సరఫరా చేసింది. ఆపరేషన్ సంజీవని పేరిట మాల్దీవులకు ఔషధాలను అందజేసింది. రెండేళ్ల కింద టర్కీ, సిరియాలను భూకంపం కుదిపేసినప్పుడు ఇండియా ఆపరేషన్ దోస్తు పేరిట ఆపన్న హస్తం అందించి తన మానవతాదృక్పథాన్ని చాటుకుంది.

Exit mobile version
Skip to toolbar