MP Rahul Gandhi : గుజరాత్‌లో సొంత నేతలపై పార్టీ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీకి బీటీమ్‌గా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్‌లో 2027లో ఎన్నికలు..
గుజరాత్‌లో 2027లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల్లో విజయం రాహుల్ దృష్టి సారించారు. రెండు రోజు పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ శుక్రవారం అహ్మదాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పలువురు సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రాహుల్ మాట్లాడారు. గుజరాత్‌లో సగం మంది కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ పార్టీతో చేతులు కలిపారని ఫైర్ అయ్యారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. కమలం పార్టీకి బీటీమ్‌గా ఉన్న వారిని బయటకు పంపుతామని హెచ్చరించారు. బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్న ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్‌లో నేతలకు కొదవలేదు..
కాంగ్రెస్‌లో నేతలకు కొదవలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 22 శాతం ఓట్లు పెరిగాయని, అసాధ్యం అనుకున్న చోట విజయం సాధించి చూపించారని గుర్తుచేశారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓటు బ్యాంకు ఉందని చెప్పారు. కానీ, అందుకు భిన్నంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్టను రోజురోజుకూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. అందరూ పార్టీ లైన్‌లో ఉండి పనిచేయాలని పిలుపునిచ్చారు. గీత దాటిన వారిపై వేటు వేయడానికి ఎంతో సమయం పట్టదన్నారు. ఇప్పుటికైనా మించిపోయిందేమీ లేదని, వైఖరి మార్చుకొని పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. పీసీసీ నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకూ అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.
30 ఏళ్లుగా గుజరాత్‌లో పార్టీ అధికారంలో లేదని, తాను ఇక్కడికి వచ్చిన ప్రతీసారి 2007, 2012, 2017, 2022, 2027 అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చలు జరుగుతాయన్నారు. కానీ ప్రశ్న ఎన్నికల గురించి కాదని, మన బాధ్యతలు నెరవేర్చే వరకు గుజరాత్ ప్రజలు మనల్ని ఎన్నికల్లో గెలిపించరని, ప్రజల పట్ల బాధ్యతతో ఉన్న రోజున మనకు అధికారం కట్టబెడుతారని కీలక వ్యాఖ్యలు చేశారు.