Site icon Prime9

Maha Kumbh Mela: నేడే మౌని అమావాస్య.. ప్రయాగరాజ్‌కు పోటెత్తిన భక్త జనం

Mauni Amavasya At Maha Kumbh: మహా కుంభమేళాకు భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు. ఇప్ప‌టికే 15 కోట్ల మంది మ‌హాకుంభ్‌లో అమృత‌ స్నానాలు చేయగా, బుధవారం మౌని అమావాస్య నాడు కనీసం 10 కోట్ల మంది నదీ ప్రాంతాల్లో పుణ్య స్నానాలకు వస్తారని అధికారులు అంచనావేస్తున్నారు. దీని కోసం యూపీ స‌ర్కారు భారీగా ఏర్పాట్లు చేసింది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాల‌ను అమ‌ర్చారు. ఇప్ప‌టికే ప్ర‌యాగ్‌రాజ్‌ను నో వెహికిల్ జోన్‌గా ప్ర‌క‌టించారు. అయితే వాహనదారులకు ప్రభుత్వం పలు సూచనలు చేసింది. సంగం ప్రాంతానికి వెళ్లాలనుకునే స్థానికులు టూ వీల‌ర్ల‌ను మాత్రమే ఉపయోగించాలని ప్ర‌భుత్వం సూచించింది.

మౌనీ అమావాస్య అంటే..
మాఘ కృష్ణ అమావాస్య రోజున‌.. మౌనీ అమావాస్య అంటారు. సాధకులకు ఇది అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున చేసే జప, తప, నదీ స్నాన కర్మలకు విశేష ఫలం సిద్ధిస్తుందనేది హిందువుల విశ్వాసం. సూర్యుడు, చంద్రుడు, బృహ‌స్ప‌తి.. ఒకే రేఖ‌లోకి రావ‌డం వ‌ల్ల‌.. ప‌విత్ర న‌దుల ఆధ్యాత్మిక శ‌క్తి మ‌రింత దిగ్విణీకృతం అవుతుంద‌ని శాస్త్ర ప్రమాణం. ఈ నేప‌థ్యంలో నేటి ఉద‌యం 6.45 నిమిషాల‌కు .. త్రివేణి సంగమంలో స్నానం ఆచ‌రించే భ‌క్తుల‌పై పూల‌వ‌ర్షం కురిపించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ షాహీ స్నాన పుణ్య సమయంలో ముందుగా నాగ సాధువులు, పలు అఖాడాల నుంచి వచ్చే సాధుసంతులు భారీ ర్యాలీగా న‌దీ తీరానికి చేరుకుంటారు.

కిక్కిరిసిన అయోధ్య
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వస్తున్న భక్తులు అటునుంచి అయోధ్యకు తరలి రావటంతో అయోధ్య జనసంద్రంగా మారింది. తెలిపింది. కాగా, భక్తుల రాకతో అయోధ్యా నగరి రద్దీగా మారింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున అయోధ్యలోని రామ మందిరాన్ని 25 లక్షల మందికిపైగా భక్తులు సందర్శించారు. ఈ రద్దీ దృష్ట్యా రామ మందిరం, హనుమాన్‌ గర్హి ఆలయాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించింది.

Exit mobile version