Massive encounter in Chhattisgarh: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్‌లో 12 మంది మావోయిస్టుల హతమయ్యారు. అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ భీకర కాల్పుల్లో పోలీసుల చేతిలో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా చేపట్టిన సెర్స్ ఆపరేషన్‌లో ఏడుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, మావోయిస్టులకు కాల్పులు జరిగాయి.
ఛత్తీస్ గఢ్‌లోని నారాయణ్ పూర్, దంతెవాడ, జగదల్ పూర్, కొండగావ్ జిల్లాల భద్రతా బలగాలు బస్తర్ పరిధిలో ఉన్న అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా చేపట్టాయి. ఇందులో భాగంగా కూంబింగ్ చేస్తున్న సమయంలో పోలీసుల దళాలపైకి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు చేశారు.
ఈ కాల్పులు తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులు కొనసాగుతున్నాయని ఇప్పటివరకు 7 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నామని, ఈ యాంటీ నక్సల్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.