Mallikarjuna Kharge Sensational Comments on PM Modi Govt: ఎన్డీయే ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్డీయే సర్కారు దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతుందని ఆరోపించారు. బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలను అన్నిరంగాల్లో వెనుకను నెట్టివేసిందని మండిపడ్డారు. రిజర్వేషన్ల విషయంలో నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతికి ఒకరోజు ముందు దేశవ్యాప్తంగా ఆయన విగ్రహాలను శుద్ధి చేయడం సిగ్గుచేటన్నారు. ఎస్సీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు మీడియా సమావేశంలో పాల్గొని ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అంబేద్కర్ ఆశయాలకు తూట్లు..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే ఉద్దేశం మోదీ సర్కారుకు లేదని విమర్శించారు. ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తోందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ రెండు రాజ్యాంగ నిర్మాతకు శత్రువులని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే సర్కారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై గౌరవం మాటలకే పరిమితమైందన్నారు. ఆయన ఆశయాలను నెరవెర్చే ఉద్దేశం అసలు వారికి లేదని మండిపడ్డారు. అంబేద్కర్ వారసత్వంపై పెదవి విరుస్తున్నారని దుయ్యబట్టారు. 1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి ఎస్ ఏ డాంగే, వీడీ సావర్కర్ కారణం అయ్యారని ఆరోపించారు. ఈ విషయాన్ని అంబేద్కర్ ఓ లేఖలో పేర్కొన్నారని గుర్తుచేశారు.
రిజర్వేషన్లు ప్రజలకు బహుమతి..
దేశవ్యాప్తంగా కులగణన గురించి ఖర్గే నొక్కి చెప్పారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం పౌరులకు అంబేద్కర్ ఇచ్చిన బహుమతి అన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పొందే హక్కును కల్పిస్తుందన్నారు. ఏఐసీసీ సమావేశంలో గుర్తించిన సామాజిక న్యాయానికి సంబంధించిన అభిప్రాయాలను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం విధానాలను రూపొందిస్తోందని చెప్పారు. కానీ, 2021 జనాభా లెక్కల గురించి ఇంతవరకు జాడ లేదని ఖర్గే అన్నారు. సాధారణ జనాభా లెక్కలతో పాటు ఏ విభాగంలో ఎంత పురోగతి సాధించామో తెలుసుకోవడానికి కులగణన ఉపయోగపడుతుందన్నారు. అందుకే కాంగ్రెస్ తన వాణిని వినిపిస్తోందన్నారు.