Mahayuti sweeps Maharashtra Election Results 2024: ముందస్తు అంచనాలను నిజం చేస్తూ మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీల అండతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ కూటమికి జనం బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు, ఎన్నడూ ఊహించనన్ని సీట్లిచ్చి ఆదరించారు. ఇక, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 45 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా సీఎం పీఠమూ దానికే దక్కనుందని తెలుస్తోంది. గత ఐదేళ్లలో అనేక మలుపులు తిరిగిన మహారాజకీయానికి.. మరాఠా ఓటరు ఎలాంటి గందరగోళం లేని తీర్పు ఇవ్వటంతో మరో మూడు రోజుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే చర్చ జరుగుతోంది.
కుర్చీపై నేతల మాట
ఈసారి షిండే, ఫడ్నవిస్ మధ్యే ప్రధానంగా ముఖ్యమంత్రి పీఠానికి పోటీ ఉంది. కాగా, తమ భాగస్వామ్య పక్షాలతో చర్చించి ఈ విషయాన్ని నిర్ణయిస్తామని ఎన్నికల ఫలితాల అనంతరం ఫడ్నవీస్ వెల్లడించారు. ‘నిర్ణయం ఏదైనా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి వివాదం లేదు’ అని ఆయన ప్రకటించారు. అయితే, ఏకనాథ్ షిండే మాట్లాడుతూ, ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకే సీఎం పీఠం దక్కాలనేదేమీ లేదని, కామన్ మ్యాన్‌గా ఉన్న తనను సీఎం చేసిన ఘనతన ప్రజలదేనని, తనను ఇప్పుడు సూపర్ మ్యాన్‌గా మార్చాల్సిందీ ప్రజలేనని అన్నారు.
పడ్నవీస్‌కే పీఠం
ఫడ్నవిస్‌కే సీఎం పీఠం దక్కనుందనే అభిప్రాయం మెజారిటీ బీజేపీ నేతల్లో ఉంది. 288 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీకి 145 సీట్లు అవసరం కాగా, బీజేపీ సొంతంగానే ఆ సంఖ్యకు చేరువైంది. దీంతో షిండే మద్దతు లేకుండానే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సత్తా బీజేపీకి చేకూరింది. ఏక్‌నాథ్ షిండేకు ఈ విషయం తెలియదనలేం. ఈ పరిణామలకు బలం చేకూరుస్తూ కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అంటూ ఫలితాలు వెలువడుతుండగానే పలు చోట్ల పోస్టర్లు వెలిసాయి.
విపక్ష హోదా కోల్పోయిన పార్టీలు
మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 50 సీట్ల మార్కును కూడా దాటలేదు. ఈ కూటమి 45 స్థానాల్లో విజయం సాధించింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్ 15, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) 10 సీట్లు గెలిచాయి. కాగా, నిబంధనల ప్రకారం మొత్తం 288 సీట్లలో 10 శాతం లేదా 29 సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే ఎంవీఏలోని ఏ పార్టీ కూడా ఆ మేరకు సీట్లు గెలువలేదు. దీంతో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి ఏ పార్టీ కూడా అర్హత సాధించలేదు.