Site icon Prime9

Mahakumbh mela 2025: ఆధ్యాత్మిక హేల.. మహా కుంభమేళా

Maha Kumbh Mela in Prayagraj, Uttar Pradesh humanity’s largest gathering: ప్రపంచంలోని హిందువులంతా ఎంతో పవిత్రమైనదిగా భావించే మహాకుంభమేళా రెండు రోజుల నాడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధానంగా జరిగే మహాకుంభమేళాకు తొలిరోజే భారీగా భక్తులు మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధానంగా జరిగే మహాకుంభమేళాకు తొలిరోజే భారీగా భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు చేశారు. జనవరి 13న ప్రారంభం కాగా, ఫిబ్రవరి 26 వరకూ జరిగే ప్రపంచపు అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక.. సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు సాగనుండగా, సుమారు 60 కోట్లమంది పుణ్యస్నానాలు చేయనున్నారని అంచనా. మన కుంభమేళాలో నాలుగు రకాలున్నాయి. మొదటిది.. మహాకుంభమేళా. ఇది 144 ఏండ్లకు ఒకసారి కేవలం ప్రయాగ్ రాజ్‌లోనే జరుగుతుంది. ఇది 12 పూర్ణ కుంభమేళాకు సమానం. రెండవది.. పూర్ణ కుంభమేళా. ఇది పన్నెండేళ్లకు ఒకసారి అలహాబాద్‌, ‌హరిద్వార్‌, ‌నాసిక్‌, ఉజ్జయినిలో జరుగుతుంది. మూడవది.. అర్ధ కుంభమేళా. దీనిని ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్‌, అలహాబాద్‌లో నిర్వహిస్తారు. చివరిది..మాఘ కుంభమేళా. దీనిని మినీకుంభ్‌ అనీ అంటారు. దీనిని ఏడాదికి ఒకసారి జనవరి-ఫిబ్రవరి నెలలలో 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌లో మాత్రమే నిర్వహిస్తారు.

ఈ మహాకుంభమేళాకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎందరో విదేశీ రచయితలు ఈ ఆధ్యాత్మిక వేడుక గురించి తమ రచనలలో ప్రస్తావించారు. ముఖ్యంగా చైనా యాత్రికులకు 1400 ఏండ్లకు పూర్వం నుంచే ఈ వేడుకతో అనుబంధం ఉంది. 7వ శతాబ్దంలో చైనీస్ యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ ప్రయాగలో జరిగిన కుంభమేళా గురించి తన రచనల్లో ప్రస్తావించారు. క్రీ.శ 644లో ఆ ప్రాంత పాలకుడు హర్షవర్ధనుడి గురించి, ఆ ప్రాంతపు ఘనమైన సంస్కృతిని, సమృద్ధినీ తన రచనల్లో ప్రస్తావించాడు. భారత్‌లో 16ఏళ్ళ పర్యటనల విశేషాలను.. తన రచన ‘సి-యూ-కి’లో ప్రస్తావించాడు. ఇందులో ప్రయాగ నగర నిరాడంబరత, మేధో వికాసం, సముజ్వల సాంస్కృతిక జీవనం, అక్కడ ఘనంగా జరిగే ధార్మిక ఉత్సవాలను వివరంగా వర్ణించాడు. పర్వదినాల వేళ.. భారత ఉపఖండపు పలు ప్రాంతాల పాలకులతో సహా 5లక్షల మందికి పైగా ప్రయాగను సందర్శించేవారని, గంగా యమునా నదుల మధ్య సుమారు 40 కి.మీ వ్యాసార్ధం పరిధిలో విస్తరించిన ప్రయాగ మహానగరంలోని పాతాళపురి దేవాలయం విశిష్టతను ఆయన తన రచనలో ప్రస్తావించాడు. ఈ ఆలయంలో ఒక నాణెం దానం చేసిన వారికి బయట వెయ్యి నాణేలు దానం చేస్తే వచ్చే పుణ్యం వస్తుందని, ఆలయ ఆవరణలోని.. అక్షయ వటవృక్షం దగ్గర స్నానం చేస్తే పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని భక్తులు విశ్వసించేవారని ప్రస్తావించాడు. త్రివేణీ సంగమానికి ఏటా లక్షలాది భక్త జనం నలుమూలల నుంచీ వచ్చిపోతూనే ఉండేవారని హుయాన్‌త్సాంగ్ ప్రస్తావించాడు. సంపన్నులు పుణ్యస్నానం తర్వాత పెద్దమొత్తంలో దానాలు చేసేవారని చెప్పుకొచ్చాడు.

తొమ్మిదో శతాబ్దంలో ఆది శంకరుల మూలంగా, కుంభమేళాకు మరింత ప్రాచుర్యం లభించింది. వారి చొరవతోనే కుంభమేళా ప్రస్తుత రూపం సంతరించుకుందని చెబుతారు. ఆదిశంకరులు నాలుగు పీఠాలను, పది సాధు సంప్రదాయాలను స్థాపించారని, ఈ సాధువులంతా కుంభపర్వంలో సమావేశమై సమాలోచనలు జరపాలని, ప్రజలలో సమైక్యాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించాలని ఆదేశించారని చెబుతారు. అందుకే.. . కుంభమేళా వేళ హిమాలయ మునులు, ఇతర యోగులు, వివిధ సంప్రదాయాల గురువులు, ఆచార్యులు, తమ అనుయాయులతో కూడి ఈ వేడుకకు తరలి రావటమనే సంప్రదాయం మొదలైంది. అన్ని పంథాల, పీఠాల అధిపతులు సమావేశమై గతం గురించి సమీక్షించి, భవిష్యత్‌ ‌గురించి చర్చించి, తరువాతి కుంభమేళాకు ప్రణాళికను రూపొందిస్తారు.
ఇక.. తీర్థరాజంగా పేరున్న ప్రయాగలో అనేక విశేషాలున్నాయి. ఇక్కడి భరద్వాజ ఆశ్రమం నుంచే రామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతుడై చిత్రకూటం దిశగా సాగిపోయాడని రామాయణం చెబుతోంది. అలాగే లంకలో విజయం సాధించిన శ్రీరాముడు ఇక్కడికి వచ్చి భరద్వాజుని ఆతిథ్యం స్వీకరించి, ఆ మహాముని చెప్పిన సత్యనారాయణుని కథను విన్నాడని చెబుతారు. ఇలాంటి ఎన్నో పురాణగాథలు ప్రయాగ్‌రాజ్‌తో ముడిపడి ఉన్నాయి.

బ్రిటిషర్ల పాలనలోనూ కుంభమేళా ఖ్యాతి మరింత పెరిగింది. కేవలం సాధువులు, అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలూ ఈ వేడుకకు తరలి వచ్చేవారు. 1918 నాటి మహాకుంభమేళాలో మహాత్మాగాంధీ కూడా పాల్గొన్నారు. అయితే, ఇలాంటి ధార్మిక కార్యక్రమాల వల్ల సమాజంలో ఐకమత్యం పెరుగుతోందనే భయంతో బ్రిటిషర్లు ఈ వేడుకల మీద పన్నులు విధిస్తూ.. ఆంక్షలు పెంచే యత్నం చేశారు. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా 1954లో తొలి కుంభమేళా నిర్వహించారు. అక్కడి నుంచి ఈ పుణ్యకార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రతిసారీ భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహాకుంభమేళా జరిగే 45 రోజుల పాటూ ఈ ప్రాంతమంతా దైవ నామస్మరణతో మార్మోగుతుంది. ఎముకలు కొరికే చలిలోనూ నూలుపోగైనా ధరించని నాగసాధువులు, ఏళ్ల తరబడి కఠిన దీక్షలో ఉండే సాధువులు, అన్ని బంధాలను తెంచుకొని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు. ఈసారి జరుగుతున్న కుంభమేళాను ప్లాస్టిక రహితంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మొదలు పలు సామాజిక, సాంస్కృతిక సంస్థలు ఇచ్చిన పిలుపుమేరకు ‘ఏక్ థాలీ.. ఏక్ థైలా’ అనే కార్యక్రమం అమల్లోకి వచ్చింది. మహా కుంభమేళాకి వచ్చే ప్రతి ఒక్కరికీ వారు.. సంబంధిత నదీ తీర పట్టణంలో రైళ్లు, బస్సుల్లో దిగగానే.. వారికి ఒక గుడ్డ సంచీ, ఒక స్టీలు కంచం అందించనున్నారు. అక్కడ ఉన్నన్ని రోజులు వారు దానిని వాడుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించవచ్చని యోచిస్తున్నారు.

Exit mobile version