Madhya Pradesh Accident Eight telangana Peoples Dead from prayagraj: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా… మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాద్ వాసులు దుర్మరణం చెందారు.
జబల్‌పుర్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి 30పై సిహోర వద్ద మినీ బస్సును ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు జబల్‌పుర్ జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా వెల్లడించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.
ఈ ఘటన జబల్‌పుర్ జిల్లాలోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8.30 నిమిషాలకు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. జాతీయ రహదారి 30పై ఓ ట్రక్కు రాంగ్ రూట్‌లో రావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. ప్రమాదం సమయంలో చాలామంది బస్సుల్లో చిక్కుకున్నారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా ఏపీ వాసులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సిహూరా ఆస్పత్రికి తరలించారు. కాగా, తొలుత ప్రమాదానికి గురైన బస్సు నంబర్ ఆధారంగా పోలీసులు ఏపీ వాసులుగా గుర్తించారు. కానీ మృతదేహాల వద్ద పలు ఆధారాలు దొరికాయి. వీటి ఆధారంగా వీరంతా హైదరాబాద్‌లోని నాచారం వాసులుగా గుర్తించినట్లు తెలుస్తోంది.
రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ మేరకు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.