S.N.Subrahmanyan: దేశం అభివృద్ధి చెందాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే . అయితే ఇప్పుడు తాజాగా ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ మరో అడుగు ముందుకేశారు. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాల్సి ఉంటుందని తెలిపాడు. ఆదివారం సెలవులు కూడా వదులుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
“మీ భార్యను చూస్తూ ఎంతసేపు కూర్చుంటారు? ఎక్కువ సమయం ఆఫీసుల్లో గడుపుతామని మీ భార్యలకు చెప్పాలి. అవసరం అయితే వారానికి 90 గంటలు పని చేయాలి. ఆదివారాలు కూడా వదులుకోవాలి. క్షమించండి, నేను మీతో ఆదివారం పని చేయలేకపోతున్నాను, నేను మిమ్మల్ని ఆదివారం పని చేయించగలిగితే మరింత సంతోషిస్తానని అన్నారు.”
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్‌టాపిగ్‌గా మారాయి. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. వర్క్ విషయంలో భార్య ప్రస్తావన తీసుకురావడాన్ని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అధిక పనిని ప్రోత్సహించే సంస్కృతిని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలను చిన్నాభిన్నం చేశాయని పలువురు అభిప్రాయపడ్డారు. అతని భార్యను చూడటం వంటి వ్యాఖ్య ముఖ్యంగా తీవ్ర విమర్శలకు దారితీసింది.
గతంలో నారాయణమూర్తి ఓ పాడ్‌కాస్ట్‌లో దేశాన్ని నిర్మించడంలో సహాయం చేయడానికి భారతీయ యువత వారానికి 70 గంటలు పని చేయాలని సూచించారు. . ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువని అన్నారు. ఇది విస్తృత నిరసనలకు దారితీయగా.. మరికొందరు నారాయణమూర్తి వ్యాఖ్యలకు మద్ధతుగా నిలిచారు.