Kolkata Police: సాధారణంగా అత్యవసర సమయాల్లో , వీవీఐపీ ల కోసం, రాజకీయ నాయకులు, ముఖ్యమైన సెలబ్రెటీల కోసం గ్రీన్ కారిడార్స్ ఏర్పాటు చేస్తుంటారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా కోల్ కతా పోలీసులు ఒక విధ్యార్థిని కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి అందరి మన్ననలు అందుకున్నారు.
కోల్ కతా లోని హావ్ డా బ్రిడ్జ్ సమీపంలో ఒక విద్యార్థిని ఏడుస్తూ ఉంది. అటు వైపు వెళ్తున్న అందరినీ సాయం కోసం కోరింది. కానీ , ఎవరూ పట్టించుకోవడం లేదు.
అయితే, అదే ప్రాంతంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఇన్ స్పెక్టర్ సౌవిక్ చక్రవర్తి అనే పోలీసు ఈ దృశ్యాలను చూశాడు.
అసలు సమస్యేంటో తెలుసుకునేందుకు ఆమెకు దగ్గరకు వెళ్లి విషయం అడిగాడు.
తాను 10 వ తరగతి చదువుతున్నానని.. ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నానని, శాయం బజార్ లోని ఆదర్శ్ శిక్ష నికేతన్ పరీక్షా కేంద్రానికి వెళ్లాలని చెప్పింది.
కానీ ఎవరు సాయం చేయలేదని భావోద్వేగానికి లోనైంది. ఇంట్లో వారు ఎవరు తోడు రాలేదా అని ఇన్ స్పెక్టర్ ప్రశ్నించగా.. తన తాన చనిపోవడంతో అందరూ అంత్యక్రియలకు వెళ్లినట్టు తెలిపింది.
దీంతో వెంటనే స్పందించిన ఇన్ స్పెక్టర్ విద్యార్థిని ని తన అధికారిక వెహికల్ లో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు.
హావ్ డా వంతెన నుంచి శాయం బజార్ లోని ఎగ్జామ్ సెంటర్ వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ కంట్రోలకు ఆదేశాలు జారీ చేశాడు.
ఉదయం 11.30 గంటలకల్లా ఆమెను ఎగ్జామ్ సెంటర్ వద్దకు చేర్చడంతో.. పరీక్ష రాసేందుకు వీలు పడింది.
ఇదే విషయం ఇన్ స్పెక్టర్ సౌవిక్ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘నాకు కుమార్తె ఉంది. 11 వ తరగతి చదువుతోంది. అందుకే ఒక విద్యార్థిని పడే బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నాను.
నాకు ఆమె పరిస్థితి తెలిసినపుడు సమయం 11.20 అయింది. తక్షణమే స్పందించడంతో 11.30 గంటల వరకు ఎగ్జామ్ సెంటర్ దగ్గరకు చేర్చాను.
అధికారిక వాహనం కాకుండా మరొక వాహనంలో కూడా పంపొచ్చు.. కానీ , ఒక వేళ ఆమె పరీక్ష రాయలేక పోతే ఎలా ఆలోచించాను.
అందుకే వెంటనే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆదేశించాను. పరీక్ష రాస్తానో.. లేనో అని విద్యార్థిని చాలా ఆందోళన చెందింది’ అని ఆయన జరిగిన ఘటనను వివరించారు.