Wayanad landslide : గతేడాది కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లిన ఘటన పెను విషాదం నింపింది. బాధిత కుటుంబాల పునరావాసం కోసం మోడల్ టౌన్‌షిప్‌ను నిర్మించారు. ఇవాళ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన ఘటనలో బాధితుల పునరావాసం కోసం కేంద్రం నుంచి ఇప్పటివరకు ఆర్థిక సాయం అందలేదని ఆయన వెల్లడించారు. పునరావాస పనులకు కేవలం రుణం మాత్రం అందిందని చెప్పారు. అదీ తగినంతగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాసం కోసం కేంద్రం తన మూలధన పెట్టుబడి పథకం నుంచి దాదాపు రూ.529.50 కోట్ల రుణం మంజూరు చేసిన విషయాన్ని సీఎం విజయన్ ప్రస్తావించారు. కేంద్రంతో తమకు ఉన్న గత అనుభవాల నుంచి ఇంకేమీ ఆశించలేమని చెప్పారు.
కేరళలోని గతేడాది జూలై 30న మండక్కై, చూరాల్‌మలతోపాటు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 200 మందికి పైగా మృతిచెందారు. అనేకమంది గల్లంతయ్యారు. విలయానికి సర్వం కోల్పోయిన బాధితుల కోసం కాల్పెట్టలోని ఎల్‌స్టన్ ఎస్టేట్‌లో కేరళ సర్కారు సేకరించిన స్థలంలో ప్రభుత్వం టౌన్‌షిప్ నిర్మిస్తోంది. 64 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక్కో ప్లాటుకు ఏడు సెంట్లు చొప్పున వెయ్యి చదరపు అడుగుల చొప్పున టౌన్‌షిప్‌లో ఇళ్లు నిర్మిస్తున్నారు.