Prime9

Bengaluru stampede : తొక్కిసలాట ఘటనపై కన్నీళ్లు పెట్టుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

DK Shivakumar gets emotional : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సం సందర్భంగా తొక్కిసలాటలో టీనేజీ పిల్లలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఘటన తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బాధను ఏ కుటుంబం భరించలేదన్నారు.

 

పిల్లల మృతదేహాలపై రాజకీయాలా?
తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 15 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో 10 మందిని దగ్గరగా చూశానని చెప్పారు. బాధను తట్టుకోవడం ఏ కుటుంబం వల్ల కాదన్నారు. ఘటన నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపారు. ఓ తల్లి తన కుమారుడి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఇవ్వాలని ప్రాధేయపడ్డారని గుర్తుచేశారు. న్యాయపరంగా అది తప్పదు కదా అని డీకే కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ విమర్శలపై డీకే శివకుమార్ స్పందించారు. పిల్లల మృతదేహాలపై ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు.

 

పరిస్థితి క్షణాల్లోనే చేజారిపోయింది..
మైదానం వద్ద పరిస్థితి క్షణాల్లోనే చేజారిపోయిందని పేర్కొన్నారు. వెంటనే పోలీసు కమిషనర్‌ తనను సంప్రదించి జరిగిన విషయం చెప్పారన్నారు. ఒకరిద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయారని, కార్యక్రమం తొందరగా ముగించాలని కోరారు. దీంతో తాను వెంటనే మైదానం వద్దకు వెళ్లినట్లు చెప్పారు. తనతో కర్ణాటక క్రికెట్‌ సంఘం ప్రెసిడెంట్‌, సెక్రటరీ ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయొద్దని వారిని కోరినట్లు తెలిపారు. 10 నిమిషాల్లోనే ముగించాలని చెప్పగా, వారు అంగీకరించారని వివరించారు. తర్వాత ఈవెంట్‌ను త్వరగా ముగించేశామని డీకే శివకుమార్‌ ప్రమాద పరిస్థితులను వివరించారు.

 

అంతకుముందు ఘటన జరిగిన తర్వాత డీకే స్పందించారు. బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. విషాదంతో తన గుండె ముక్కలైందన్నారు. ఇలాంటిది జరగకుండా ఉండాల్సిందని, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రణాళికలు చేస్తామని తెలిపారు. క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఉంటామంటూ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

Exit mobile version
Skip to toolbar