ISRO’s historic 100th launch this month: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన 100వ రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ ప్రయోగం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జరగనుంది. 2025 జనవరి 29వ తేదీ ఉదయం 6.23 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్‌ను ప్రయోగించనున్న ఇస్రో, ఈ రాకెట్ ద్వారా దేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (నావిక్)లో భాగంగా ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కి.మీ ఎత్తున ఉన్న నిర్దేశిత భూస్థిర కక్షలో ప్రవేశపెట్టనుంది. కాగా, జీఎస్‌ఎల్‌వీ-15 రాకెట్‌తో ఎన్‌వీఎస్ ఉపగ్రహం అనుసంధాన ప్రక్రియ పూర్తయ్యిందని ఇస్రో ఆదివారం పేర్కొంది.
ప్రయోగానికి రంగం సిద్దం
కాగా, ప్రయోగ సన్నద్ధత మీద ఇస్రో తన ‘ఎక్స్’ పోస్ట్‌లో వివరాలను ప్రస్తావించింది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద శాస్త్రవేత్తలు రాకెట్‌ను ప్రయోగ వేదికకు తరలించడానికి మూడు దశల అనుసంధాన ప్రక్రియ పూర్తి అయిందని, శిఖర భాగంలో ఉన్న ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియ కూడా బాగానే ముగిసిందని ఆ పోస్టులో చెప్పుకొచ్చింది.
ఇది రెండవది..
కాగా.. ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని 29 మే 2023న ఇస్రో నింగిలోకి పంపింది. కాగా, తాజాగా ఇస్రో పంపుతున్న ఎన్‌వీఎస్ -02 సెకండ్ జెనరేషన్ శాటిలైట్. దీనిలో ఎల్1, ఎల్5, ఎస్ బ్యాండ్‌లలో నావిగేషన్ పేలోడ్లను.. అలాగే తొలితరం ఉపగ్రహం ఎన్‌వీఎస్-01లో ఉన్నట్లుగానే సీబ్యాండ్‌లో రేజింగ్ పేలోడ్స్ ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్ రూపొందించగా.. ఇతర శాటిలైట్ సెంటర్లు సహకారం అందించాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జియోసింక్రోనస్ శాటిలైట్ తరహాలో ఇది ఎనిమిదవ రాకెట్ ప్రయోగం కావడం విశేషం. ఇదిలా ఉండగా జీఎస్ఎల్వీ రాకెట్ 17వ ప్రయోగం కాగా.. జీఎస్ఎల్వీ ఎఫ్15 రాకెట్ ప్రయోగం ఇస్రోకు 00వ ప్రయోగం కానుంది.
ప్రయోజనం ఇదే..
నావిక్.. దేశంలో అభివృద్ధి చేసిన స్వదేశీ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇది 1500 కి.మీ. వరకు భారత భూభాగం వెలుపల కూడా సరిగ్గా, వేగంగా సమాచారాన్ని అందించగలుగుతుంది. ఈ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపిన అనంతరం, కక్షలో తిరుగుతూ భారతదేశ నావిగేషన్ వ్యవస్థను విస్తరించడంలో కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా ఆర్మీ రంగానికి, సైనిక, నావికా దళాల కార్యకలాపాలకు, వ్యూహాత్మక అనువర్తనాలను ఛేదించడంలోనూ సహాయపడనుంది. భూగోళ నావిగేషన్‌ను మెరుగుపరచడంలోనూ, సముద్రంలో ఎక్కువ మత్స్య సంపద ఉన్న ప్రాంతాలను గుర్తించి మత్స్యకారులకు తెలిపేందుకు ఇది దోహదపడుతుంది. దీని బరువు 2,250 కేజీలు. సుమారు10 ఏళ్ల పాటు కక్షలో తిరుగుతూ సేవలు అందిస్తుందని ఇస్రో అధికారులు తెలిపారు. ఈ ప్రయోగం ఇస్రోకి 100వ రాకెట్ ప్రయోగంగా గుర్తింపు పొందడంతో, షార్‌లో వివిధ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.