ISRO Successfully Docks SpaDeX Satellites in Space: ఇస్రో కొత్త ఏడాది ప్రారంభంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇస్రో పంపించిన రెండు ఉపగ్రహాలు విజయవంతమయ్యాయి. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో గురువారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్‌సెంటర్ నుంచి పంపిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60 లో రెండు ఉపగ్రహాలను డిసెంబర్ 30వ తేదీన ఇస్రో ఆకాశంలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్-1బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్-1ఎ రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం మూడుసార్లు ప్రయత్నించగా, పలు కారణాలతో ఇది వాయిదా పడుతూ వచ్చింది.
నాలుగో దేశంగా..
చివరకు గురువారం వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్‌ను మొదలుపెట్టారు. ఇది విజయవంతమైనట్లు ఇస్రో తమ పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీనికోసం శ్రమించిన సాంకేతిక బృందానికి, యావత్ భారతీయులకు అభినందనలు తెలిపింది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో ఈ తరహా సాంకేతికతలో భారత్ కూడా వాటి సరసన చేరింది.
ప్రధాని మోదీ హర్షం..
రెండు ఉపగ్రహాలను విజయవంతమైన సందర్భంగా ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక బృందానికి అభినందనలు. రాబోయే సంవత్సరాల్లో మన దేశ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగాలను ఇది కీలక మెట్టుగా నిలిచింది’ అని ప్రధాని రాసుకొచ్చారు.