ISRO Chief : భారత అంతరిక్ష ఫరిశోధనా సంస్థ ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే ప్రయోగాలు విజయవంతమయ్యేలా ఆశీర్వదించాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈ సందర్భంగా సోమేశ్వర్ మహాపూజ నిర్వహించిన ఆయన యజ్ఞంలోనూ పాల్గొన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.
గిర్ సోమనాథ్ జిల్లాలోని వెరవల్ పట్ణణంలో ఉన్న ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఇస్రో చీఫ్ సోమనాథ్ విలేకర్లతో మాట్లాడారు. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ కావాలన్న తమ కల స్వామివారి కృపవల్లే సాకారమైందన్నారు. సోమనాథుడి ఆశీస్సులు లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. అందుకే తాను ఇక్కడికి వచ్చానన్నారు ఇస్రో చీఫ్. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే మిషన్‌లకు ఆ మహాదేవుడి ఆశీస్సులు కోరినట్టు ఇస్రో చీఫ్ చెప్పారు. మనం పనిచేయాలంటే బలం కావాలి. చంద్రుడిపై ల్యాండింగ్ మాకు ఓ టాస్క్. మాకు బలం అవసరమయ్యే అనేక ఇతర మిషన్లు మా ముందు ఉన్నాయి. అందుకే భగవంతుడి ఆశీస్సులు పొందేందుకు ఇక్కడికి వచ్చానని అన్నారు. ఇస్రో చీఫ్ సోమేశ్వర్ మహాపూజ అనంతరం ఆలయ ప్రాంగణంలోని వినాయక ఆలయంలో యజ్ఞంలో పాల్గొన్నారని శ్రీసోమనాథ్ ట్రస్టు జీఎం తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు తుదిశ్వాస విడిచినట్లు భక్తులు విశ్వసించే ప్రాంతం భాల్కతీర్థను సైతం ఆయన సందర్శించారని దేవాలయ అధికారులు తెలిపారు.