Brahmaputra water : బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపినా ఏం కాదు : పాక్‌కు అస్సాం సీఎం కౌంటర్
Assam CM Himanta Biswas Sharma : ఇండియా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత పాకిస్థాన్ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘ఒకవేళ బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే’ అనే ప్రచారాన్ని గణాంకాలు వాస్తవాలతో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తిప్పికొట్టారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. ప్రచారానికి ఎటువంటి ఆధారం లేదని కొట్టి పారేశారు.
వాస్తవాలతో తిప్పికొడదాం..
కాలం చెల్లిన సింధూ జలాల పంపిణీ ఒప్పందం నుంచి ఇండియా బయట పడిన తర్వాత.. ఇప్పుడు పాక్ తమకు కొత్త బూచిని చూపించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నీటిని ఇండియాకు రాకుండా ఆపేస్తే పరిస్థితి ఏమిటి..? అంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఊహాజనిత కట్టుకథను వాస్తవాలతో తిప్పికొడదామని ఆయన పిలుపునిచ్చారు.
బ్రహ్మపుత్ర నది ఇండియాలో ప్రవహించే కొద్దీ విస్తరిస్తుందని, కానీ కుంచించుకుపోదని పేర్కొన్నారు. చైనా నుంచి 30-35శాతం జలాలు మాత్రమే వస్తాయని వివరించారు. చాలావరకు మంచు కరిగి టిబెట్‌లోని పరిమిత వర్షాల వల్ల లభిస్తాయన్నారు. మిగిలిన 65-70శాతం నీరు ఇండియా నుంచి వస్తోందన్నారు. అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయాలో రుతుపవనాల వల్ల కురిసే వర్షాలకు ధన్యవాదాలు చెప్పాలన్నారు. శుభాంశ్రీ, లోహిత్, కమెంగ్, మానస్, ధన్‌శ్రీ, జియా భరాలి, కోపిలి దీనికి ప్రధాన ఉపనదులు అన్నారు. ఇవిగాక ఖాసీ గారో, జయంత హిల్స్ నుంచి కుల్సీ, కృష్ణాయ్, దిగారు నదుల నుంచి మిగిలిన జలాలు లభిస్తాయన్నారు. అది భారత్-చైనా సరిహద్దుల్లో సెకనుకు 2వేల -3వేల క్యూబిక్ మీటర్ల మేరకు నీరు ప్రవహిస్తుందని చెప్పారు. అస్సాంలో రుతుపవనాల సీజన్‌లో సెకన్‌కు 15,000-20,000 క్యూబిక్ మీటర్లగా ఉంటుందని వివరించారు.
అది వర్షాధారిత భారత నది..
బ్రహ్మపుత్ర జలాల కోసం ఇండియా ఎగువ నుంచి వచ్చే ప్రవాహం కోసం ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అది వర్షాధారిత భారత నది అని పేర్కొన్నారు. సిండియాలోకి వచ్చిన తర్వాతే అది బలపడుతుందన్నారు. పాక్ తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే.. ఒకవేళ నీటి ప్రవాహాన్ని తగ్గించాలనుకుంటే అది ఇండియాకే ప్రయోజనకరమన్నారు. అస్సాంలో ఏటా వచ్చే వరదలు తగ్గి, లక్షల మంది నిరాశ్రయులు కాకుండా ఉంటారని చెప్పారు.
పాక్ కొన్ని దశాబ్దాలుగా సింధూజలాల ఒప్పందంలో లభించిన ప్రాధాన్యంతో దోచుకుందన్నారు. ఇప్పుడు ఇండియా వాస్తవంగా తనకు రావాల్సిన హక్కు అడగడంతో బెంబేలెత్తిపోతోందన్నారు. వారు ఒకటి గుర్తుంచుకోవాలన్నారు. బ్రహ్మపుత్ర కేవలం ఒక్క దానితో నియంత్రించలేమన్నారు. అది తమ భౌగోళిక పరిస్థితులు, మా రుతుపవనాలతో బలోపేతమైందని పేర్కొన్నారు.
ఇటీవల సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ వైస్ ప్రెసిడెంట్ విక్టర్ జికాయ్ గావ్ తొలిసారి అంశాన్ని లేవనెత్తాడు. ఇండియా సింధూజలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై స్పందించారు. బ్రహ్మపుత్ర నది నుంచి నీరు భారత్‌కు వెళ్లకుండా చైనా ఆపగలదని పేర్కొన్నాడు. అంశాన్ని పాకిస్థాన్ మీడియా బాగా ప్రచారంలోకి తీసుకొచ్చింది.