Chief Minister Of Jharkhand: నేడే హేమంత్ సోరెన్ ప్రమాణం.. నాల్గోసారి సీఎంగా బాధ్యతలు

Hemant Soren To Take Oath As Chief Minister Of Jharkhand: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి ఘనవిజయం నేపథ్యంలో ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. నేడు రాష్ట్ర రాజధాని రాంచీలో జరిగే ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా ‘ఇండియా’ కూటమికి చెందిన అగ్రనేతలు ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధాన హేమంత్ సోరెన్ ఇటీవల స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాను కలిసి ఆహ్వానించారు. 2000 నవంబర్ 15న బీహార్ నుంచి జార్ఖాండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14వ ముఖ్యమంత్రిగా సోరెన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం పదవిని సోరెన్ చేపట్టడనుండటం ఇది నాలుగోసారి.

మంత్రి వర్గ కూర్పుపై చర్చలు
కాగా, నూతన ప్రభుత్వ కూర్పుపై జేఎంఎం, కాంగ్రెస్, ఇతర భాగస్వామ్య పక్షాల మధ్య జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 81 స్థానాలకు గానూ 56 సీట్లు గెలుచుకున్న కూటమిలో 34 సీట్లు జేఎంఎం గెలుచుకోగా, కూటమి భాగస్వాములైన కాంగ్రెస్-16, ఆర్జేడీ- 4, సీపీఐ (ఎంఎల్)- 2 సీట్లు గెలుచుకున్నాయి. కొత్త ప్రభుత్వంలో మొత్తం సీఎంతో సహా 12 మందికి అవకాశం ఉండగా, జేఎంఎంకు 6, కాంగ్రెస్ పార్టీకి 4, ఆర్జేడీకి, సీపీఐ (ఎంఎల్)కు చెరొక మంత్రిపదవి దక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

కొత్త మంత్రులు వీరేనా?
ఈసారి జేఎంఎం నుంచి చైబాసా ఎమ్మెల్యే దీపక్ బీరువా, ఘట్‌సిలా ఎమ్మెల్యే రాందాస్ సోరెన్, మధుపూర్ ఎమ్మెల్యే హఫీజుల్ హసన్‌లకు మంత్రి పదవులు ఖాయమని, గతంలో మంత్రిగా ఉన్న మిథిలేష్ ఠాకూర్ స్థానంలో శరత్ ఎమ్మెల్యే ఉదయ్ శంకర్ సింగ్ అలియాస్ చున్నా సింగ్‌లకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇచాఘర్ ఎమ్మెల్యే సవితా మహతో లేదా లూయిస్ మరాండీలలో ఒకరికి కేబినెట్ బెర్త్ దక్కే ఛాన్స్ ఉందని జేఎంఎం వర్గాల సమాచారం. కాంగ్రెస్ నుంచి లోహర్దగా ఎమ్మెల్యే డాక్టర్ రామేశ్వర్ ఓరాన్, మహాగామా ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్, ఓబీసీ కోటాలో ప్రదీప్‌ యాదవ్‌, మైనారిటీ కోటాలో నిషాత్ ఆలంలకు కేబినెట్ బెర్త్ దక్కు అవకాశముంది.