Prime Minister Modi to attend G7 summit in Canada: ప్రధాని మోదీ కెనడా పర్యటనలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కెనడాలో రేపటి నుంచి మూడు రోజులపాటు జీ7 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సదస్సు జరగనుంది. సదస్సులో పాల్గొనాలని ప్రధానికి కెనడా నుంచి గతవారం ఆహ్వానం అందించింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ మోదీకి ఫోన్ చేసి సదస్సుకు రావాలని ఆహ్వానించారు. భారత్-కెనడా ఇరుదేశాల మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో జీ 7 సమ్మిట్‌కు ప్రధాని మోదీ దూరంగా ఉంటారన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సదస్సుపై ప్రభుత్వ వర్గాలు క్లారిటీనిచ్చాయి.
ప్రధాని మోదీ కెనడా పర్యటనలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. సదస్సులో పాల్గొనాలని మోదీ నిర్ణయించుకున్నట్లు తెలిపాయి. సదస్సుకు ప్రధాని రేపు ఢిల్లీ నుంచి బయలు దేరి వెళ్తారని తెలిపాయి. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జీ7 సదస్సు కీలకంగా మారింది. సదస్సులో ఇరుదేశాల వివాదంపై ప్రధాని చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చర్చల ద్వారా వివాదానికి పరిష్కారం చూపాలని మోదీ కోరనున్నట్లు సమాచారం. ఇటీవల పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ నాయకులతో ప్రధాని మోదీ చర్చించనున్నట్లు తెలిసింది.