Prime9

Congress : కాంగ్రెస్‌ నుంచి దిగ్విజయ్‌ సోదరుడి బహిష్కరణ

Digvijay Singh’s brother expelled from Congress : మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ కీలక నేత దిగ్విజయ్‌ సింగ్‌ తమ్ముడు లక్ష్మణ్‌ సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు. లోక్‌సభలో పతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై అతడు చేసిన వ్యాఖ్యల వల్లే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కాంగ్రెస్‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వెంటనే నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

 

లక్ష్మణ్‌ సింగ్ ఐదుసార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల ఆయన పార్టీ నాయకత్వంపై విమర్శలు చేశారు. దీంతో ఆయనకు ఇటీవల పార్టీ షోకాజ్‌ నోటీసును జారీ చేసింది. ఆయనపై సస్పెన్షన్‌పై ఆల్‌ఇండియా కాంగ్రెస్‌ కమిటీలోని క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకొంది.

 

ఏప్రిల్‌ 24వ తేదీన పహల్గామ్ బాధితులకు నివాళులర్పించే సమయంలో లక్ష్మణ్‌ సింగ్‌ మాట్లాడారు. రాహుల్‌ గాంధీ, రాబర్ట్‌ వాద్రా పరిపక్వత లేని నాయకులని ఆరోపించారు. వారి అపరిపక్వత వైఖరితో తలెత్తే పరిణామాలను దేశం అనుభవిస్తోందన్నారు. రాబర్ట్‌ వాద్రా స్వయంగా రాహుల్‌ బావ అన్నారు. ఓ వర్గాన్ని రోడ్లపై ప్రార్థనలు చేయనీయకపోవడంతోనే దాడి జరిగిందని అంటారని గుర్తుచేశారు. ఇలాంటి పిల్లతనాన్ని ఎప్పటి వరకు భరిస్తామన్నారు. రాహుల్‌ లోక్‌సభ ప్రతిపక్ష నేత అని, ఆయన మాట్లాడే ముందు ఆలోచించాలన్నారు. జమ్మూకశ్మీర్‌ సీఎం ఉగ్రవాదులతో కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించారు. లక్ష్మణ్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ క్రమశిక్షణ సంఘం కార్యదర్శి తారిక్‌ అన్వర్‌ నోటీసులు జారీ చేశారు. రాహుల్‌ గాంధీతోపాటు పార్టీ సీనియర్‌ నాయకత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, లక్ష్మణ్ హద్దులు దాటారని పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar