Delhi Assembly Elections 699 candidates for 70 seats: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. అధికార, విపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడెక్కాయి. మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం వెల్లడించారు.
2020తో పోలిస్తే..
2020 ఏడాది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 672మంది అభ్యర్థులు ఈ సారి పోటీ చేసేవారి సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సారి 981 మంది అభ్యర్థులు 1522 నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు పూర్తి కావడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను మంగళవారం ప్రకటించారు.
న్యూఢిల్లీ నుంచి 23మంది పోటీ..
ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీలో అత్యధికంగా 23మంది పోటీలో ఉన్నారు. జనక్‌పురిలో 16మంది, రోహ్తాస్ నగర్, కర్వాల్‌నగర్, లక్ష్మీనగర్‌లలో 15 మంది చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పటేల్‌నగర్, కస్తూర్బా నగర్‌ల్లో అత్యల్పంగా ఐదుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 70 నియోజకవర్గాలు ఉండగా, 38చోట్ల 10మంది కన్నా తక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తిలక్‌నగర్, మంగోల్‌పురి, గ్రేటర్ కైలాస్ సీట్లలో ఆరుగురు చొప్పున, చాందినీ చౌక్, రాజేంద్రనగర్, మాలవీయనగర్‌ల్లో ఏడుగురు చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు.
బీఎస్పీ 69 చోట్ల పోటీ..
ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుండగా, బీజేపీ మాత్రం 68 చోట్ల అభ్యర్థులను బరిలో దించింది. మిగతా రెండు సీట్లను తన మిత్రపక్షాలైన జేడీ(యూ), ఎల్జేపీలకు కేటాయించింది. మరోవైపు, బీఎస్పీ 69 చోట్ల అభ్యర్థులను పోటీలో ఉంచింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న నిర్వహించి, 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్న విషయం తెలిసిందే.
439 కేసులు నమోదు..
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వ్యవహారంలో 439 కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 7 నుంచి 20 మధ్య నమోదైనట్లు తెలిపారు. అక్రమ కార్యకలాపాలు, ఆయుధాలు, మద్యం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు వీలుగా బోర్డర్ చెక్‌పాయింట్ల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నేపథ్యంలో రూ.కోటి విలువ చేసే 38,075 లీటర్ల మద్యం, రూ.17కోట్ల విలువైన 104.90కిలోల డ్రగ్స్, 1200 నిషేధిత ఇంజెక్షన్లతోపాటు రూ.3.55 కోట్ల నగదు, 37.39 కిలోల వెండిని సీజ్ చేసినట్లు వివరించారు.
బీజేపీ రెండో మేనిఫెస్టో విడుదల
అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ హామీలు ఇవ్వగా, మంగళవారం బీజేపీ మరో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు పార్టీలు పలు హామీలు ఇస్తున్నాయి. తాజాగా బీజేపీ రెండో మేనిఫెస్టోలను విడుదల చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఎంపీ అనురాగ్ ఠాకూర్ ‘సంకల్ప పత్రం’ విడుదల చేశారు. ఢిల్లీలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ.15వేల ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. దీంతో విద్యార్థులకు బీజేపీ భారీ ఆఫర్ ప్రకటించింది.