Site icon Prime9

Dalits have no share in development: నేటికీ నిరాశాజనకమైన సమాధానాలే.. అభివృద్ధిలో దళితుల వాటా ఏదీ?

Dalits have no share in development: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశంలోని కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పించాలనే లక్ష్యంతోనే మన స్వరాజ్య పోరాట యోధులు ఒక గొప్ప రాజ్యాంగ రచనకు పూనుకున్నారు. ముఖ్యంగా పుట్టుకతోనే అంటరానివారిగా గుర్తించబడి, బతికినంతకాలం మనుషులుగానూ గుర్తింపుకు నోచుకోని దళితులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలనే సంకల్పంతోనే రాజ్యాంగంలో రిజర్వేషన్లతో సహా కొన్ని నిర్దిష్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే, 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన మన రాజ్యాంగం గడచిన ఏడున్నర దశాబ్దాల కాలంలో ఏ మేరకు దళితులకు మేలు చేసింది? రాజ్యాంగం కల్పించిన రక్షణలు, ఫలాలు ఆ వర్గానికి పారదర్శకంగా అందుతున్నాయా? రాజ్యాంగం కల్పించిన వెసులుబాట్లను దళిత సమాజం ఏ మేరకు అందిపుచ్చుకుని ముందుకు సాగింది? అనే ప్రశ్నలు వేసుకుంటే నేటికీ నిరాశాజనకమైన సమాధానాలే వినిపిస్తాయి. భారత దేశంలో వందల ఏళ్లుగా పాతుకుపోయిన ఒక బలమైన సామాజిక వివక్షను తుడిచిపెట్టటానికి భారత్ వంటి సంప్రదాయ దేశంలో ఏడున్నర దశాబ్దాల సమయం మరీ ఎక్కువని చెప్పలేకపోయినా, వేగంగా మారుతున్న సమాజపు లెక్కలో దానిని మరీ తక్కువ సమయమనీ కొట్టిపారేయలేము. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో నేటికీ దళితుల పట్ల స్పష్టమైన వివక్ష, అంటరానితనం కొనసాగుతూనే ఉండగా, ఎక్కడోచోట దాడులు, అవమానాలు, సాంఘిక బహిష్కరణలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.

రాజ్యాంగ రచనా కాలంలో వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనంచేసి, రాజ్యాగ సభ నిర్ణయాలకు అనుగుణంగా ముసాయిదాను తయారు చేశారు. మన రాజ్యాంగ పీఠిక పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో సమన్యాయం కల్పించాలని స్పష్టంగా నిర్దేశించింది. ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంటుకు చట్టాల రూపకల్పన బాధ్యతను, వాటిని సమర్ధంగా అమలు చేసేందుకు కార్యనిర్వాహక వ్యవస్థను, ఈ రెండింటిని పర్యవేక్షించేందుకు సర్వ స్వతంత్రమైన న్యాయవ్యవస్థను రూపొందించింది. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి చట్టసభలలో గానీ, విధాన పరమైన నిర్ణయాలలో గానీ దళిత సమాజపు భాగస్వామ్యం ఆశించిన మేరకు లేకపోవటం, ఎన్నికైన సభ్యులు సైతం ఆయా పార్టీలకు విధేయులుగా వ్యవహరించటంతో చట్టసభలలో, కార్యనిర్వాహక వ్యవస్థలో అగ్రవర్ణ, ధనిక, పెట్టుబడిదారీ వర్గాలే పెత్తనం చెలాయిస్తూ వచ్చాయి. దీని మూలంగానే ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదు. చట్టం ముందు అందరూ సమానమని చెప్పే ఆర్టికల్ 14, కుల,మత, లింగ, ప్రాంతాల ఆధారంగా పౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదని చెప్పే ఆర్టికల్‌ 15, అంటరానితనం నేరమని, దానిని తుడిచిపెట్టాలని స్పష్టం చేసిన ఆర్టికల్ 17 ఆధారంగా వచ్చిన పౌరహక్కుల చట్టం 1955, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989, కులవివక్ష వ్యతిరేక పోరాటాల నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫారసులు.. తెలుగు రాష్ట్రాల దళితులలో చైతన్యం కలిగించేందుకు దోహదపడినా, వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావటానికి మాత్రం దోహదం చేయలేకపోయాయి.

రాజ్యాంగం 4వ భాగంలో ఆర్టికల్‌ 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాల్లో దేశ సంపద, వనరులు కొద్ది మంది చేతిలో కేంద్రీకరించకుండా అన్ని వర్గాల ప్రజలకు సమానంగా పంపిణీ చేయాలని, పౌరులందరికీ గౌరవప్రదమైన జీవన ప్రమాణాలు, జీవనోపాధి కల్పించాలని, ఒక పనికి ఒకే వేతనమని, ఆరోగ్య భద్రత అందరి హక్కు అని స్పష్టం చేశాయి. ప్రత్యేకించి సామాజిక న్యాయం, దోపిడీ నుంచి రక్షణ, విద్యావకావకాశాలతోపాటు ఆర్థిక ప్రయోజనాలు కాపాడాలని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, ఈ అంశాలకు విరుద్ధంగా దేశసంపద వేగంగా గుప్పెడు మంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమవుతూ పోతోంది. సంపన్నులు మరింత సంపన్నులుగా, పేదలు కటిక పేదలుగా మారుతున్నారు. ఈ ఆర్థిక వివక్షలో అత్యంత ప్రభావితమవుతున్న వర్గాలుగా నేడు దళితులే ఉన్నారు. నేటికీ దేశవ్యాప్తంగా ఉన్న దళితులలో సగంమంది అక్షర జ్ఞానానికి నోచుకోలేకపోగా, వీరిలో 70 శాతం మంది భూమి లేని కూలీలుగా, రెక్కల కష్టం మీదనే బతుకులీడుస్తున్నారు. ఆరు దశాబ్దాల నాడు వచ్చిన భూసంస్కరణల తర్వాత మళ్లీ దేశంలో ఆ దిశగా అడుగులు పడకపోవటంతో, ప్రభుత్వాలు దయతలచి ఇచ్చే ఎసైన్డ్ భూములు, నీడకోసం వారిచ్చే ప్రభుత్వ స్థలాలే వీరికి ఆధారంగా ఉన్నాయి. అదీ హక్కుగా గాక పాలకుల దయాభిక్షగానే ఇవి సమకూరుతున్నాయి. ఈపాటి ఔదర్యమైనా పాలకులు చూపటానికి దళితులు పెద్ద ఓటు బ్యాంకుగా ఉండటమే కారణం తప్ప వారిపట్ల ప్రత్యేక ప్రేమ ఏమీ లేదని చెప్పాల్సిన పని లేదు. ఇక, దేశంలో ఎక్కడైనా పోర్టులు, విమానాశ్రయాలు, గ్రోత్ కారిడార్లు, జాతీయరహదారులు, ప్రభుత్వ సంస్థలు వచ్చిన సందర్భాలలో ల్యాండ్ పూలింగ్ పేరుతో లాక్కునేదీ దళితుల భూములననేది తెలిసిందే.

దళితుల పరిస్థితిని మెరుగుపరచేందుకు గత ప్రభుత్వాల హయాంలో వచ్చిన ఎస్సీ సబ్ ప్లాన్ మూలంగా, తమకు వనరుల్లో కనీస వాటా దక్కుతుందనే కనీస అవగాహన దళిత సమాజంలో వచ్చిన మాట నిజమే. తర్వాతి రోజుల్లో ఈ విధానాన్ని దేశంలోని పలు రాష్ట్రాలు అమలు చేస్తూ వస్తున్నా, ఆ ప్లాన్ అమలులోనూ అప్పుడప్పుడూ పాలకులు వంచనకు పాల్పడుతూనే ఉన్నారు. బడ్జెట్‌లో పెద్దమొత్తం నిధులు కేటాయించటం, ఆనక వాటి విడుదల జాప్యంచేయటం, నెమ్మదిగా వాటిలో కొంత మరో పథకానికి మళ్లించటం, విడుదల విషయంలోనూ ఉదారంంగా వ్యవహరించకపోవటం, కొన్ని రాష్ట్రాలలోనైతే వాటిని ఏకంగా మురగబెట్టి, తర్వాతి ఏడాది బడ్జెట్ లెక్కల్లో చూపే యత్నం చేయటం వంటి ప్రయత్నాలు ఏదో ఒక స్థాయిలో జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. బ్యాంకులిచ్చే సాగు, విద్య, ఉఫాధి రుణాలలోనూ దళితుల వాటా లెక్కలు చూస్తే, ఆర్థిక సమానత్వం ఎంతగొప్పగా వర్థిల్లుతోందో కూడా అర్థమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పక్కనబెట్టిన ప్రభుత్వాలు కాంట్రాక్ట్, ఔట్ సోర్స్ విధానాన్ని ఎంచుకోవటం, ప్రైవేటు రంగమంతా పెద్ద కులాల చేతుల్లో బందీగా మారటంతో నానా బాధలు పడి చదువుకున్నప్పటికీ, దళిత యువతకు తమ ప్రతిభకు తగిన అవకాశాలు దేశంలో తగిన విధంగా లభించటం లేదు. రాజ్యాంగం ఎంత మంచిదైనా, దానిని అమలు చేసే వ్యక్తులు మంచివారైతేనే ఫలితం ఉంటుందని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే స్పష్టం చేశారు. ఈ మాటను దళిత వర్గాలు గుర్తించి, తగిన పాలకులను ఎన్నుకోవటమే గాక దేశంలో జరిగే రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించి, జరిగే తప్పులను సరిచేసే ప్రయత్నం చేయటానికి చొరవ చూపాల్సి ఉంది.

Exit mobile version