Cough Syrup: భారత్‌కు చెందిన కంపెనీలు తయారుచేసిన దగ్గు మందుల వల్ల పలు దేశాల్లో మరణాలు నమోదు అవ్వడం ఇటీవల తీవ్ర కలకలానికి దారి తీసింది. ఆ అలాంటి సిరప్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో దగ్గు మందు ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ప్రభుత్వ ల్యాబ్ ల్లో దగ్గు సిరప్ లకు అనుమతి తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు తీసుకున్న తర్వాతే ఎగుమతులు చేసుకోవాలని స్పష్టం చేసింది. జూన్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
ధ్రువీకరణ పత్రం తప్పనిసరి(Cough Syrup)
‘దగ్గు మందు ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ఏదైనా ప్రభుత్వ లాబొరేటరీలో పరీక్షించి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ సమర్పిస్తేనే తమ దగ్గు మందులను ఎగుమతి చేసేందుకు అనుమతులు వస్తాయి. ఈ నిబంధనలు జూన్ 1 వ తేదీ నుంచి తప్పనిసరి’అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్, రీజినల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ , సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్ , సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ , ఆర్‌డీటీఎల్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో దగ్గు మందుకు తనిఖీలు చేయించుకోవాలని ఎగుమతుదారులకు కేంద్రం స్పష్టం చేసింది. భారత్ నుంచి ఎగమతి అయ్యే వివిధ రకాల ఔషధ ఉత్పత్తుల నాణ్యతపై ప్రభుత్వం రాజీ పడదని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇందులో భాగంగానే ఎగుమతుల కంటే ముందే దగ్గు మందుల నాణ్యతను పరిశీలించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆ అధికారి చెప్పారు.
పదుల సంఖ్యలో ప్రాణాలు
భారత్‌లో తయారైన కలుషిత దగ్గు మందు తీసుకోవడం వల్ల గత ఏడాది గాంబియ, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. . ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన WHO ఈ ఘటనపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా చర్యలకు తీసుకునేందుకు సిద్ధమైంది. 2022-23లో భారత్ 17.6 బిలియన్ డాలర్ల విలువైన దగ్గు మందులను వివిధ దేశాలకు ఎగమతి చేసింది.