Lok Janshakti Party chief Chirag Paswan : లోక్ జన్‌శక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి, బిహార్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎదురైన ప్రశ్నలకు ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. తాజాగా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన పార్టీ ర్యాలీలో పాల్గొని విషయాన్ని వెల్లడించారు.
బిహార్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తన రాష్ట్ర ప్రజల కోసం తప్పకుండా పోటీ చేస్తానన్నారు. తను రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడిని అన్నారు. ఆయన కలలను సాకారం చేసేందుకు పాటు పడతానని చెప్పారు. బిహార్ ప్రజల అభివృద్ధికే తన తొలి ప్రాధాన్యమన్నారు. ఎన్నికల్లో తను ఏ స్థానం నుంచి పోటీ చేయాలనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. తను ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమేనని చిరాగ్ పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్రతిపాదనను అధికారికంగా ప్రకటించేందుకు లోక్ జనశక్తి పార్టీ యోచిస్తోందని, అందుకోసం త్వరలో కార్యనిర్వాహక సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే చిరాగ్ స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.