Prime9

Operation Sindoor : భారత్‌, హిందువులపై పాక్ ఆర్మీ చీఫ్ విషం చిమ్మారు : సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌

CDS Anil Chauhan : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఘటనకు ముందు భారత్‌, హిందువులపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్‌ ఆసిం మునీర్‌ విషం చిమ్మారని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదానికి మద్దతునిస్తోందని, రక్తపాతం సృష్టించడమే వారి విధానమని మండిపడ్డారు. ‘భవిష్యత్ యుద్ధాలు, యుద్ధక్షేత్రాలు’పై పుణెలోని సావిత్రిబాయి ఫులే యూనివర్సిటీలో సీడీఎస్‌ జనరల్ ప్రసంగించారు. అంతర్జాతీయంగా సంఘర్షణల స్వభావం, పెరుగుతున్న సాంకేతిక ముప్పు, భారత్‌ సుదీర్ఘ కాలంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న తీరును వివరించారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రస్తావించారు. నష్టాలు ముఖ్యం కాదని, తుది ఫలితం ఏంటన్నదే ముఖ్యమన్నారు.

 

రెండుదేశాలు వివిధ రకాల సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకున్నాయని వివరించారు. యుద్ధక్షేత్రంలో మాత్రం వాటిని పరీక్షించలేదన్నారు. రిస్క్‌ తీసుకోకుంటే విజయం సాధించలేరని స్పష్టం చేశారు. మన వద్ద అత్యుత్తమమైన యాంటీ డ్రోన్‌సిస్టం ఉందని మనకు తెలుసు అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఓవైపు పోరాటం, మరోవైపు రాజకీయ పరిణామాలు ఒకేసారి చోటుచేసుకున్నాయన్నారు. నష్టాల గురించి తనను అడిగితే అవి ముఖ్యం కాదన్నారు. ఎలా స్పందించామని, ఫలితం ఏంటన్నదే ముఖ్యమన్నారు. నష్టాలు, ఎదురుదెబ్బలు అనేవి సైన్యంపై ప్రభావం చూపవన్నారు. యుద్ధంలో ఎదురుదెబ్బలు ఎదురైనా మనోబలం ఎంతో ముఖ్యమని జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు.

 

20వేల మందిని కోల్పోయాం..
పహల్గామ్ ఘటన అత్యంత క్రూరమైనది అన్నారు. కుటుంబీకుల కండ్ల ముందే అత్యంత దారుణానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో చంపడం ఆధునిక ప్రపంచంలో ఆమోదయోగ్యం కాదన్నారు. ఘటన సమాజంలో ప్రకంపనలు సృష్టించిందన్నారు. సుదీర్ఘకాలంగా భారత్‌ ఎదుర్కొంటున్న ఉగ్రదాడులను ఘటన మళ్లీ గుర్తుచేసిందన్నారు. పాశ్చాత్య దేశాలు ఒకటి, రెండు ఉగ్రదాడులు ఎదుర్కొంటే భారత్‌లో జరిగిన వందలాది ఉగ్రదాడుల్లో 20వేల మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారని చౌహాన్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

Exit mobile version
Skip to toolbar