Site icon Prime9

One Nation one Election: జమిలిపై పునరాలోచనలో మోదీ సర్కారు.. కేంద్రం వెనకడుగు?

Central Government Reverse decision to One Nation One Election Bills: ఒకే దేశం.. ఒకే ఎన్నిక పేరుతో అటు లోక్‌సభకు, ఇటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఉబలాటపడిన ప్రధాని నరేంద్రమోదీ యూటర్న్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా లోక్‌సభ బిజినెస్‌ జాబితా నుంచి రెండు బిల్లులను తొలగించటంతో ఈసారి ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంటుకు తీసుకురాకపోవచ్చని పలు పార్టీలు భావిస్తున్నాయి. ఈ నెల 16న లోక్‌సభ ముందుకు బిల్లులు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైనా, తాజాగా లోక్‌సభలో బిల్లుల జాబితా నుంచి దీనిని తప్పించటంతో జమిలి విషయంలో సర్కారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

వీటితోనే చిక్కు..
పార్లమెంట్ కాల పరిమితి, లోక్‌సభను రద్దు చేసేందుకు రాష్ట్రపతికి అవకాశం కల్పించే 83వ అధికరణతో బాటు రాష్ట్రాల శాసన సభల కాల పరిమితిని నిర్ధారించే 172వ అధికరణ, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే 356 అధికరణాలకు సవరణలు తీసుకురావాల్సి ఉంది. అయితే దీనికోసం సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. ఇప్పుడు ఎన్డీయేకి అంత బలం లేదు. పైగా, ఇండియా కూటమిలో తనతో కలిసొచ్చే కొత్త పార్టీలూ ఏవీ కేంద్రానికి కనిపించటం లేదు. పైగా, సమాఖ్య పాలన వ్యవస్థ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీటికి అంగీకారం తీసుకోవాల్సి ఉంది. దీంతో ప్రస్తుతానికి ఈ బిల్లును పక్కనబెడితేనే మంచిదని కేంద్రం భావిస్తోంది.

ఇతర అంశాలు..
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మరింత కసరత్తు చేస్తేనే మంచిదని కూడా కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో ఏకాభిప్రాయ సాధనతో ముందుకు పోవటమే మంచిదనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మరీ పట్టుదలకు పోతే.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చి.. ఇండియా కూటమికి దీనివల్ల లాభం చేకూరే ప్రమాదం ఉందని కూడా కేంద్రం భావిస్తోంది.

Exit mobile version