Social Media Harassment: ఫోన్‌ ఉందని రెచ్చిపోతే జైలుకే.. సోషల్ మీడియా కేసులపై కేంద్రం క్లారిటీ

Central Government Clarity on Social Media Harassment: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. సినిమాలు, రాజకీయాల మొదలు ప్రతిరంగంలోనూ ఒకరిని ఒకరు దూషించుకనేందుకు దీనినే వేదికగా చేసుకునే ధోరణి బాగా పెరిగింది. ఇక.. సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించడం పరిపాటిగా మారుతోంది. మరోవైపు నానాటికీ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ మాధ్యమాల నియంత్రణ మీద ఇప్పటి వరకు కేంద్రానికే నియంత్రణ ఉండటంతో ఈ విషయంలో రాష్ట్రాలు ఏమీ చేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితిలో పార్లమెంటు కీలక నిర్ణయం చేసింది. ఇకపై, ఇలాంటి కేసుల విచారణ రాష్ట్రాలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది.

అప్రతిష్ట పాలు చేస్తే కేసులే
సామాజిక మాధ్యమాల్లో మహిళలతో సహా ఎవరినైనా వేధించినా, అప్రతిష్ట పాలు చేసినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. అయితే సైబర్ నేరాల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇండియన్ న్యాయ సంహిత2023 యాక్ట్ సెక్షన్ 78 ఆధారంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది. ఈ కేసుల విషయంలో సంబంధిత చట్టంలోని సెక్షన్ ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలకు ఉపక్రమించవచ్చు. మహిళలు, పిల్లలపై సైబర్ నేరాలు అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ ఎగైనెస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ చిల్డ్రన్ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే పర్సన్ డేటా, స్వేచ్ఛతో పాటు హక్కులను సైతం కాపాడేలా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్టివ్-2023 సైతం అమలులో ఉంది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్‌లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది.