Delhi Schools Bomb Threat: డిల్లీలోని 80కి పైగా స్కూళ్లు, మరియు నోయిడాలోని కనీసం రెండు స్కూళ్లకు బుధవారం ఉదయం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది, దీంతో ఈ పాఠశాలలనుంచి విద్యార్దులను తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
తనిఖీల్లో ఏమీ దొరకలేదు..(Delhi Schools Bomb Threat)
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డిపిఎస్) ద్వారకా మరియు వసంత్ కుంజ్ యూనిట్లు, తూర్పు మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్, సంస్కృతి స్కూల్, పుష్ప విహార్‌లోని అమిటీ స్కూల్ మరియు సౌత్ వెస్ట్ ఢిల్లీలోని డిఎవి స్కూల్‌లకు బాంబు బెదిరింపు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. . డిపిఎస్ నోయిడా, అపీజయ్ స్కూల్‌కు కూడా ఇలాంటి బాంబు బెదిరింపు వచ్చింది.బెదిరింపు వచ్చిన వెంటనే పాఠశాల ప్రాంగణాన్ని ఖాళీ చేసి, విద్యార్థులను ఇంటికి పంపినట్లు వర్గాలు ఇండియా టుడే టీవీకి తెలిపాయి.డిపిఎస్ ద్వారకకు ఉదయం 6 గంటలకు బాంబు బెదిరింపు వచ్చింది, ఆ తర్వాత ఢిల్లీ పోలీసు సిబ్బంది, అగ్నిమాపక దళం బాంబు నిర్వీర్య దళం (బిడిఎస్) సంఘటనా స్థలానికి చేరుకున్నారు.అయితే పాఠశాలల ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా, అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని పోలీసు అధికారులు తెలిపారు.
భయపడవలసిన అవసరం లేదు..
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఒక ప్రకటనలో భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ మెయిల్స్ నకిలీవని తెలుస్తోందన్నారు. ఢిల్లీ పోలీసులు మరియు భద్రతా సంస్థలు ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.కాగా, ఢిల్లీ పోలీసులు, పాఠశాల అధికారులతో ప్రభుత్వ అధికారులు నిరంతరం టచ్‌లో ఉన్నారని ఢిల్లీ మంత్రి అతిషి తెలిపారు. తల్లిదండ్రులు భయపడవద్దని కూడా ఆమె కోరారు. అదేవిధంగా డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా దీనిపై సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ x లో దీనిపై స్పందించారు. పోలీస్ కమీషనర్‌తో మాట్లాడి, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని పాఠశాలల్లో బాంబు బెదిరింపులపై వివరణాత్మక నివేదికను కోరాను. పాఠశాల ప్రాంగణంలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి, నిందితులను గుర్తించి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు..తల్లిదండ్రులు భయపడవద్దని మరియు పాఠశాలలు మరియు పిల్లల భద్రతను నిర్ధారించడంలో పాలనాయంత్రాంగంతో సహకరించాలని కోరారు.