Site icon Prime9

National Herald Case : సోనియా, రాహుల్‌ గాంధీలకు ఈడీ నోటీసులు.. భారీగా ఆస్తుల స్వాధీనం

National Herald Case

National Herald Case

National Herald Case : నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఈడీ ప్రకటించింది.

 

ఢిల్లీ, ముంబయి, లక్నోల్లోని ఆస్తులపై నోటీసులు అతికించినట్లు ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. సంబంధిత ఆస్తులను ఖాళీ చేయాలని, వాటికి వచ్చే అద్దెలను బదిలీ చేయాలని ప్రకటనలో ఆదేశించింది. పీఎంఎల్‌ఏ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ ప్రచురణకర్తగా ఉంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ గాంధీతోపాటు కొందరు పార్టీ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు యాజమాన్య సంస్థ.

 

కాంగ్రెస్‌‌కు ఏజేఎల్‌ బకాయిపడ్డ రూ.90 కోట్లు వసూలు చేసుకునే విషయంలో ‘యంగ్‌ ఇండియన్‌’లో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. దర్యాప్తులో భాగంగా 2023 నవంబర్‌లో సంబంధిత స్థిరాస్తులతోపాటు ఏజేఎల్‌లో ఈక్విటీ షేర్ల రూపంలో ఉన్న ‘యంగ్‌ ఇండియన్‌’ కు చెందిన రూ.90.21 కోట్లను జప్తు చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి సోనియా, రాహుల్‌‌తోపాటు మల్లికార్జున్‌ ఖర్గే, సీనియర్‌ నేత పవన్‌ కుమార్‌ బన్సల్‌లను ఈడీ ఇప్పటికే విచారించింది. వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. తాజాగా సంబంధిత స్థిరాస్తుల స్వాధీనానికి నోటీసులు ఇచ్చింది.

 

 

 

 

Exit mobile version
Skip to toolbar