Ajit Pawar’s New office: మహారాష్ట్ర కొత్త ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల తర్వాత, రాష్ట్ర సచివాలయం సమీపంలో కొత్త ఎన్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అజిత్ పవార్ సిద్ధమయ్యారు. అయితే తాళం చెవి కనిపించకుండా పోవడంతో అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు ఆగిపోయారు.
వారు బంగ్లాలోకి ప్రవేశించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడానికి తాళం పగలగొట్టడానికి ప్రయత్నించారు, కాని లోపల గదుల తలుపులు కూడా లాక్ చేయబడ్డాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) తమకు సమయానికి కీలను అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ పార్టీ కార్యకర్తలు బలవంతంగా లోపలికి ప్రవేశించడానికి సిద్దమయ్యారు. కొత్త పార్టీ కార్యాలయం కోసం అజిత్ పవార్ ఎంచుకున్న బంగ్లా గతంలో శివసేన (యుబిటి) నాయకుడు అంబాదాస్ దాన్వేకి చెందినది.
కాగా, మంత్రాలయంలో అజిత్ పవార్ ‘ఎన్‌సీపీ’, షిండే నేతృత్వంలోని సేన, బీజేపీ తొలి కేబినెట్ సమావేశం జరుగుతోంది. జూలై 2న ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్, మహారాష్ట్ర ఎన్పీసీ చీఫ్ జయంత్ పాటిల్‌ను తొలగించి, పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్‌గా సునీల్ తట్కరేను నియమించారు. అజిత్ పవార్ ఎన్‌సిపి శాసనసభా పక్ష నేతగా కూడా ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అజిత్ పవార్ తిరుగుబాటు వర్గంలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఒకరైన ప్రఫుల్ పటేల్‌ను శరద్ పవార్ తొలగించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవార్, మరియు అతని వర్గానికి కీలకమైన మంత్రిపదవులు దక్కే అవకాశముందని తెలుస్తోంది.