Site icon Prime9

Karnataka Assembly : కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు.. ఎందుకంటే?

Karnataka Assembly

Karnataka Assembly : కర్ణాటకలో మంత్రులు సహా అనేక మంది ముఖ్యనేతలే లక్ష్యంగా కొనసాగుతోన్న ‘హనీ ట్రాప్‌’ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. జాతీయ స్థాయి నేతలతోపాటు 48 మంది రాజకీయ నాయకులు బాధితులుగా ఉన్నారంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై శుక్రవారం కర్ణాటక అసెంబ్లీ దద్దరిల్లింది. సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ నేతలు ఈ అంశాన్ని లేవనెత్తారు. దీంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. సభా కార్యక్రమాలకు అడ్డుపడిన 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ విధిస్తూ తీర్మానం చేశారు. 6 నెలల పాటు సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.

 

 

సంచలనంగా మారిన ‘హనీ ట్రాప్‌’వ్యవహారాన్ని ఇవాళ బీజేపీ సభ్యులు లేవనెత్తారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. హనీ ట్రాప్‌పై విచారణను పక్కనపెట్టి ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్‌ చేయడాన్ని విమర్శిస్తూ స్పీకర్‌ పొడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీంతో బీజేపీ సభ్యుల తీరుపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకసారి కేసు నమోదై దర్యాప్తు ప్రారంభమైతే హనీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

 

 

రాష్ట్రానికి చెందిన అనేకమంది రాజకీయ నేతలు హనీ ట్రాప్‌లో చిక్కుకుపోయారని కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్‌ రాజన్న ఇటీవల అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అసెంబ్లీలో తీవ్ర చర్చనీయాంశమైంది. తనకు తెలిసినంత వరకు కనీసం 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సీడీలు, పెన్‌డ్రైవ్‌ల్లో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు. అధికారపక్షం సహా విపక్షానికి చెందిన వారు ఉన్నారన్నారు. అంతకుముందు ఇదే అంశంపై మంత్రి సతీశ్‌ జార్కిహోళీ మాట్లాడారు. ఒక మంత్రిపై రెండుసార్లు హనీ ట్రాప్‌ యత్నం జరిగిన విషయం వాస్తవమేనని వెల్లడించారు. ఇది రాష్ట్రానికి కొత్త కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని పేర్కొన్నారు.

 

 

సస్పెన్షన్‌ వేటుకు గురైన సభ్యులు అసెంబ్లీ హాల్‌, లాబీ, గ్యాలరీలోకి ప్రవేశించకూడదు. సభ్యులు ఏ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనకూడదు. అసెంబ్లీ ఎజెండాలో సభ్యుల పేర్లతో ఎలాంటి అంశం లిస్ట్ కాకూడదు. ఈ సమయంలో వారికి రోజూవారి భత్యాలు కూడా అందవు. సస్పెండైన ఎమ్మెల్యేలను మార్షల్స్‌ బలవంతంగా బయటకు తరలించారు.

Exit mobile version
Skip to toolbar