Prime9

Rafale Fighter Jets : హైదరాబాద్‌లోనే రఫేల్ విడిభాగాల తయారీ.. ఫ్రాన్స్ సంస్థతో టాటా కంపెనీ డీల్

Rafale fighter jets  : ‘మేక్ ఇన్ ఇండియా’లో మరో కీలక ముందడుగు పడింది. భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్న రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన విడిభాగాల ఉత్పత్తి ఇకనుంచి భారత్‌లో తయారు చేయనున్నారు. ఇందుకు హైదరాబాద్‌ కేంద్రంగా నిలవడం విశేషం. ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (టీఏఎస్‌ఎల్) మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

 

ఒప్పందం ప్రకారం.. ఇకనుంచి రఫేల్‌ యుద్ధ విమానాలకు చెందిన ప్రధాన భాగాలు హైదరాబాద్‌లోని టీఏఎస్‌ఎల్‌‌లో తయారవుతాయి. రఫేల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ విడిభాగాలు ఫ్రాన్స్‌ వెలుపల తయారు కావడం ఇదే మొదటిసారి. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సంస్థ వేగవంతం చేయనుంది. నెలకు రెండు ఫ్యూజ్‌లేజ్‌లను అందించనుంది.

 

భారత రక్షణరంగ చరిత్రలోనే ఒప్పందం ఓ మైలురాయిగా నిలుస్తుందని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెట్‌ సీఎండీ సుకరన్‌ సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఒప్పందంపై డసో ఏవియేషన్ ఛైర్మన్ అండ్ సీఈవో ఎరిక్ ట్రాపియర్ మాట్లాడారు. భారత్‌లో తమ ఉత్పత్తిని బలోపేతం చేయడంలో ఇది కీలక అడుగు అన్నారు. భారత రక్షణ రంగంలో తమ సేవలను విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. నిర్ణయం రఫేల్ విస్తరణకు మరింత దోహదం చేస్తుందన్నారు. నాణ్యమైన సేవలు అందిస్తూ సైనిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar