Big Shock to Maoists – 14 Maoists Surrender in Warangal: మావోయిస్టులకు బిగ్‌షాక్ తగిలింది. ఇవాళ వరంగల్ పోలీసుల ఎదుట 14 మంది మావోలు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఎదుట 14 మంది లొంగిపోగా, వారిలో ఆరుగురు మహిళా మావోలు ఉన్నారు. ఈ సందర్భంగా వారిని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం ఐజీ వారికి రూ.25లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఐజీ మీడియాతో మాట్లాడారు. లొంగిపోయిన మావోలు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ ప్రాంతం గుత్తికోయ కమ్యూనిటీకి చెందినవారిగా గుర్తించారు. రాష్ట్ర పోలీసులు కల్పించిన అవగాహనతో వీరు లొంగిపోయినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో 250 మంది మావోలు లొంగిపోతే వారిలో 90 శాతం మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారే ఉన్నారని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో జరుగుతున్న కూంబింగ్‌లో తెలంగాణ పోలీసుల ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. కూంబింగ్ ఛత్తీస్‌గఢ్, కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ అన్నారు. ఈ విషయంలో తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్ ప్రమేయం లేదని స్పష్టం చేశారు.