TSPSC: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం ఎంతటి సంచలం సృష్టించిందో తెలిసిందే. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది. తాజాగా సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు రూ. 1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్టు విచారణలో తేలిందని సిట్ అధికారులు పేర్కొన్నారు. నిందితులకు సంబంధించిన ఖాతా వివరాలు, నగదు బదిలీల వివరాలను సేకరించినట్టు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 49 మందిని అరెస్టు చేయగా.. మరికొంత మందిని అరెస్టు చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
తొలి దశలోనే కేసు దర్యాప్తు(TSPSC)(
అరెస్టు అయిన వారిలో 16 మంది మధ్యవర్తులుగా వ్యవహరించినట్టు దర్యాప్తులో తేలిందని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన మరో నిందితుడు ప్రశాంత్ న్యూజిలాండ్‌లో ఉన్నారని చార్జ్ షీట్ లో వెల్లడించారు. ఏఈఈ ప్రశ్నపత్రం లీకైన తర్వాత 13 మందికి, డీఏవో పేపర్ 8 మందికి, గ్రూప్-1 ప్రిలిమ్స్ 4 గురి చేరిందని గుర్తించామన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ చేరిన నలుగురిలో టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు. మరొకరు బయటి వ్యక్తిగా తేలిందని వివరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు తొలి దశలోనే ఉందని సిట్ అధికారులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
అరెస్టులు పెరిగే అవకాశం
ఇటీవల అరెస్టయిన డీఈ పూల రమేష్ సహకారంతోనే ఏఈఈ, డీఏవో పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన ముగ్గుర్ని అరెస్టు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను రామంతాపూర్‌లోని సెంట్రల్ ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబ్ కు పంపించినట్టు తెలిపారు. ఫోన్లను పరిశీలిస్తున్న క్రమంలోనే మరింత సమాచారం బయటికి వచ్చినట్లు వెల్లడించారు. డీఈ రమేష్ ఏఈఈ ప్రశ్నపత్రాన్ని మరికొంత మందికి అమ్మినట్టు భావిస్తున్నామని సిట్ అధికారులు చెప్పారు. కాబట్టి పేపర్ లీక్ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.