Site icon Prime9

Yadagirigutta : యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలి.. అసెంబ్లీలో కొండా సురేఖ

Yadagirigutta

Yadagirigutta : దేవాదాయ చట్ట సవరణ బిల్లుపై మంగళవారం తెలంగాణ శాసన సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి ఆలయ పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. 18 మంది సభ్యులతో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభ్యుల పదవీ కాలం రెండేళ్లుగా కొనసాగుతారని పేర్కొన్నారు. బోర్డు చైర్మన్‌కు, సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని, డీఏలు మాత్రం ఉంటాయన్నారు. ఆలయ ఈవోగా ఐఏఎస్ అధికారి ఉంటారని వెల్లడించారు. బోర్డు బడ్జెట్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని వెల్లడించారు. బోర్డు ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక పాఠశాలలను నెలకొల్పి నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

 

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తెలంగాణలోని దేవాలయాలకు భక్తుల తాకిడి భారీ సంఖ్యలో పెరిగిందని చెప్పారు. గతంలో యాదగిరిగుట్టలో సాధారణ భక్తులకు సరైన సదుపాయాలు లేవని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లు ఖర్చు చేసి వసతులు ఏర్పాటు చేసిందన్నారు. మంచి సౌకర్యాల కల్పనకు పాలకమండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు. పాలకమండలి ఆధ్వర్యంలో యాదగిరిగుట్టను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో రూ.100 కోట్ల ఆదాయం వచ్చే అలయాలన్నీ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయని మంత్రి సురేఖ పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar