Site icon Prime9

Telangana BJP: తెలంగాణ బీజేపీలో మొదలైన చర్చ.. అధ్యక్ష పీఠం ఎవరిదో?

Telangana BJP New President: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక తర్వలో జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీలోని సీనియర్ నేతలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. గతంలో టీ బీజేపీ బాస్‌గా ఉన్న బండి సంజ‌య్‌ని తప్పించిన అధిష్ఠానం ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని కూర్చోబెట్టింది. తాజాగా, రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించాలని యోచిస్తున్న హస్తిన పెద్దలు పలు కోణాల్లో ఇక్కడి నేతల పేర్లను పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో న‌లుగురు కీలక నేత‌లు ఈసారి బరిలో నిలిచారని, తమదైన శైలిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

జోష్ తెచ్చిన సంజయ్
గత బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌గా పనిచేసి, తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతోన్న బండి సంజయ్ తాను ఇప్పటికే బరిలో లేనని ప్రకటించారు. తాను కేంద్రమంత్రిగానే కొనసాగుతానని తాజాగా సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కానీ, వాస్తవానికి ఆయన హయాంలోనే టీ బీజేపీలో కొత్త ఉత్సాహం వచ్చిందని, దుబ్బాక, హుజురాబాద్ బైపోల్ లో విజయంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అతి తక్కువ సమయంలో పార్టీ సత్తా చాటిందని పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ గ్రేటర్ ఎన్నికలు వస్తుండటంతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చేంతగా జనంలో బలపడాలంటే కట్టర్ హిందూ నేత అయిన సంజయ్ రావాలని, ఆయన రాకతో యువత పార్టీవైపు చూస్తుందని వారు చెబుతున్నారు.

ఈటల మాటేంటి?
ఇక ఈసారి రేసులో ఉన్న నేతల్లో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు కూడా వినిపిస్తోంది. బండి సంజయ్‌ని తప్పించి.. కిషన్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చే సమయంలోనే ఈటల ప్రెసిడెంట్ అవుతారనే చర్చ జరిగినా, అది సాధ్యపడలేదు. అయితే బీసీ ఓట్లను రాబట్టేందుకు ఈటల రాజేందర్‌కు అవకాశమిస్తే బాగుంటుందనే కోణంలోనూ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

వకీల్ సాబ్‌కు ఛాన్సిస్తే..
ఈసారి బరిలో ఉన్న మరో నేత.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన రఘునందన్ పార్టీలో చేరాక ఇక్కడి సిద్ధాంతాలను అడాప్ట్ చేసుకుని గట్టిగా పార్టీవాణిని జనంలోకి తీసుకుపోవటంలో సక్సెస్ అయ్యారు. ప్రశ్నించే గొంతుగా, దూకుడు గల నేతగా గుర్తింపు పొందిన రఘునందన్, గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో ఓడినా, వెంటనే పట్టుబట్టి మెదక్ ఎంపీ టికెట్ తెచ్చుకుని గెలిచి సత్తా చాటారు. అధ్యక్షుడిగా ఛాన్సిస్తే సత్తా చాటుతానని ఆయన చెబుతున్నారు.

రేసులో ఆ ముగ్గురూ
బీజేపీ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు కూడా పార్టీ అధ్యక్ష రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదినుంచి పార్టీలో ఉన్న నేతగా, సంఘ్ నేపథ్యం గల వకీలుగా ఆయనకు గుర్తింపు ఉంది. గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఈయనకు గ్రేటర్ బీజేపీ ప్రెసిడెంట్ గానూ పనిచేసిన అనుభవమూ ఉంది. అదే సమయంలో తమ పేర్లనూ పరిశీలించాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా కాషాయ దళపతి రేసులో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఈసారి ఆశావహులు ఎక్కువగా ఉండటంతో..సామాజిక సమీకరణాలు, ఇతర లెక్కలు వేసుకుంటున్న అధిష్ఠానం చివరికి ఎవరి పేరును ప్రకటిస్తుందో వేచి చూడాల్సిందే.

Exit mobile version