Cm Revanth Reddy : ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదనే ఉద్దేశంతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో మనుషులు, మిషిన్లతోపాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సొరంగంలో ఎనిమిది మంది గల్లంతైన నేపథ్యంలో సహాయక చర్యలను సీఎం, మంత్రులు టన్నెల్‌లోకి వెళ్లి స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎస్‌ఎల్‌బీసీ వద్ద అన్ని విభాగాల అధికారులు, ఏజెన్సీలతో సహాయక చర్యలపై సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.
పదేళ్లుగా పట్టించుకోలేదు..
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను 2005-06లో ప్రారంభించారని, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 32 కిలోమీటర్ల టన్నెల్ పూర్తయిందని తెలిపారు. కానీ, గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీని పట్టించుకోలేదన్నారు. పనులు చేస్తున్న సంస్థ విద్యుత్ బిల్లులు చెల్లించలేదని, విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో పదేళ్లుగా టన్నెల్ పనులు ఎక్కడి అక్కడే నిలిచిపోయాయని చెప్పారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతానికి కృష్ణా జలాలు అందించాలని నిర్ణయించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించామన్నారు. నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌కు కావాల్సిన విడి భాగాలను అమెరికా నుంచి తెప్పించి పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకున్నామని, కానీ, అనుకోకుండా ఘటన జరిగిందని చెప్పారు.
గల్లంతైన కుటుంబాలకు పార్టీలు అండగా ఉండాలి..
ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలు చేయడం తగదన్నారు. విపత్తు సమయంలో జాతీయ స్థాయిలో నిపుణులైన 11 కేంద్ర సంస్థలు, ప్రైవేటు ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని చెప్పారు. గల్లంతైన 8మంది ఆచూకీ ఇప్పటి వరకూ తెలియలేదన్నారు. ఆపరేషన్ కొలిక్కి రావడానికి మరో రెండు మూడు రోజల సమయం పడుతుందని తెలిపారు. కన్వేయర్ బెల్ట్ పాడుకావడం వల్లే సిల్ట్ తొలగించేందుకు ఆటంకమేర్పడిందని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రానికి కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారన్నారు. మట్టి తీసిన తర్వాత మిషన్ తొలగించి, గల్లంతైన వారిని గుర్తించాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి ప్రమాదంపై రాజకీయం చేయడం తగదని స్పష్టం చేశారు. సొరంగంలో గల్లంతైన కుటుంబాలకు అన్ని పార్టీలు అండగా ఉండాలని సూచించారు. మరింత పట్టుదలతో ప్రాజెక్టు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోందని, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
విపక్షాలు బురద రాజకీయాలు..
ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం, లోపం ఎక్కడైనా ఉందా? దురదృష్టకర ఘటనపై విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో శ్రీశైలం పవర్‌ప్లాంట్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు చనిపోయారని సీఎం గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా తాను ప్రమాద స్థలికి వెళ్దామంటే అనుమతించలేదన్నారు. దేవాదులలో 9మంది గల్లంతు అయితే ఐదేళ్ల తర్వాత అస్తిపంజరాలు దొరికాయని, మేడిగడ్డ నష్టానికి, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కుంగిన ఘటనకు తేడా ఉందని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు నష్టం.. నిర్లక్ష్యం, నాణ్యతాలోపం వల్ల జరిగిందని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిన ఘటన విపత్తు లాంటిదన్నారు. ఘటన జరిగిన వెంటనే హరీశ్‌రావు ఎందుకు రాలేదని, ప్రమాదం తర్వాత హరీశ్‌రావు రెండు రోజులు అబుదాబిలో దావత్ చేసుకున్నారని సీఎం వివర్శించారు.