Site icon Prime9

Telangana Cabinet : ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

Telangana Cabinet

Telangana Cabinet : సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సీఎం అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో దాదాపు 2 గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా న్యాయనిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేబినెట్‌లో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశ తేదీల ఖరారు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌ మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ నెల 10వ తేదీ తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.

మున్సిపాలిటీల్లో విలీనానికి రైట్ రైట్..
మల్కాజిగిరి మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మండలాలను మున్సిపాలిటీల్లో విలీన చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో పట్టణ జిల్లాగా మేడ్చల్ మారుతుంది. సెర్ఫ్, మెప్మా విలీనానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ములుగుతోపాటు మరికొన్ని పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిన నేపథ్యంలో గ్రామ పంచాయతీల జాబితా నుంచి ఆ గ్రామాలను తొలగిస్తూ తీర్మానం చేసింది.

తెలంగాణలో 59 ఎస్సీ కులాలు..
మాల, మాదిగ, డక్కలి ఇలా రాష్ట్రంలో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. జాబితాలోని కులాలకు ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో కొంతశాతం వరకు రిజర్వేషన్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 15 శాతం ఉంది. అంటే 100లో 15 శాతం ఉద్యోగాలు ఈ కులాలకు చెందిన వారికే ఇస్తారు. ఆ జాబితాలోని కులాల మధ్య అసమానతలు ఉన్నాయి. అందులో కొన్ని కులాలు ముందు ఉన్నాయి. మరికొన్ని కులాలు వెనుకబడి ఉన్నాయని ఆయా కులాల వారు చెబుతూ వచ్చారు. దీంతో ఎస్సీలకు ఇచ్చిన రిజర్వేషన్లను కొన్ని కులాలు మాత్రమే ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్నాయని, మిగతా కులాల వారు వెనుకబడే ఉంటున్నారని ఇతర కులాలు ఆరోపిస్తూ వస్తున్నారు.

ఎస్సీలకు ఇచ్చిన 15 శాతం రిజర్వేషన్‌ను తిరిగి, కులాల మధ్య విభజించి పంచాలనే డిమాండ్ వినిపించింది. ప్రధానంగా రిజర్వేషన్ ఫలితాలు మాలలు ఎక్కువ అనుభవించారు. అందుకే వర్గీకరణ చేయాలని మాదిగలు పోరాటం చేశారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పోరాటం కొనసాగింది. ఈ క్రమంలోనే మాలలు మాత్రం దీన్ని వ్యతిరేకించారు.

Exit mobile version
Skip to toolbar