Graduate MLC Elections : రాష్ట్రంలో కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. మూడు రోజులపాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగింది. ఈ క్రమంలోనే విజయం దోబూచులాడి చివరకు బీజేపీ అభ్యర్థిని వరించింది. 53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి ఆధిక్యంలో నిలువగా, 78,635 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి 73,644 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. దీంతో నరేందర్‌రెడ్డి లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అంజిరెడ్డి విజయ సాధించారని అధికారులు ప్రకటించి ధ్రువపత్రం అందజేశారు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ : బండి సంజయ్
రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీ మంచి విజయాలు సాధించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్-ఆదిలాబాద్- మెదక్- నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో బండి మాట్లాడారు.
విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు..
బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీ నిజాయితీ పాలనను ప్రజలంతా గుర్తించారని తెలిపారు. మోదీ పాలనా ప్రభావంతోనే విజయాలు సాధించగలుగుతున్నామన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీజేపీ విజయాన్ని ఆపలేరన్నారు. డబ్బుల సంచులకు దీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించాయని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు కొన్నాళ్లుగా ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని, బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు. ఇప్పుడేమంటారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడించాలని కుట్ర చేశాయని, తెలంగాణలో కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైందన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటూ, బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ మాట తప్పిందని, తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని బండి సంజయ్ అన్నారు.